సీఎం ప్రమాణ స్వీకారం ఎందుకు ఆలస్యమవుతోంది? అసలు కారణమేంటి?
అర్థం లేని ఆలస్యం అయోమయానికి కారణం కావటమే కాదు.. అనవసరమైన చర్చకు.. కన్ఫ్యూజన్ కు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది
అర్థం లేని ఆలస్యం అయోమయానికి కారణం కావటమే కాదు.. అనవసరమైన చర్చకు.. కన్ఫ్యూజన్ కు తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరితే చాలు.. ముఖ్యమంత్రి పంచాయితీ రెండు.. మూడు రోజుల పాటు సాగి చివరకు ఒకరిని ఓకే చేయటం.. దానిపై కత్తులు నూరే బ్యాచ్ ఒకటి తయారు కావటం రోటీన్ గా సాగేది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం పక్కా అన్నంతనే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం సోమవారం ఉంటుందన్న స్క్రోలింగ్ టీవీ స్క్రీన్ల మీద బ్రేకింగ్ న్యూస్ పేరుతో పడింది. అంతేకాదు.. ఈ కార్యక్రమం రాజ్ భవన్ వేదిక కానుందన్న మాట వినిపించింది.
ఇంత జెట్ స్పీడ్ తో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటంపై విస్మయం వ్యక్తమయ్యేలా చేసింది. కట్ చేస్తే.. సోమవారం ఖాయంగా సీఎం ప్రమాణ స్వీకారోత్స కార్యక్రమం అనూహ్యంగా ఆగింది. సీఎల్పీ సమావేశం జరగటం.. అనంతరం ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కొంత కిందా మీదా పడేలా చోటు చేసుకున్న పరిణామాలతో పాటు.. ఈ అంశాన్ని లెక్క తేల్చేందుకు ఢిల్లీ నేతలు రంగంలోకి వచ్చారని చెబుతున్నారు.
మరోవైపు.. సీఎంను రేవంత్ గా ఎంపిక చేసినట్లుగా వార్తలు రాగా.. ప్రముఖ మీడియా చానళ్లు కొన్ని మాత్రం ఈ అంశంపై గందరగోళం జరిగేలా ప్రవర్తిస్తుందని చెబుతున్నారు. ఇంతకూ సీఎం ప్రమాణ మహోత్సవం ఎందుకు ఆలస్యమైంది? ముందుగా చేసిన ప్రకటనలో దొర్లిన తప్పులేంది? ఏ కారణాలు సీఎం ప్రమాణ స్వీకారోత్సవం చేయకుండా అడ్డుకుంటున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారమని ఆదివారం రాత్రి ప్రచారం జరగ్గా.. పొద్దుపోయిన వేళలో చోటు చేసుకున్న మార్పులతో కొత్త అయోమయం ఎదురైంది. సోమవారం మధ్యాహ్నం వేళకు సోషల్ మీడియాలో తిరిగిన పోస్టును చూస్తే.. సోమవారం రాత్రి 8 గంటల వేళలో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం ఉందంటూ పోస్టుల మీద పోస్టులు వైరల్ గా మారాయి. కానీ.. అలాంటిదేమీ లేదన్న విషయం చాలా ఆలస్యంగా తెర మీదకు వస్తోంది. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోగా.. కనీసం గందరగోళ పరిస్థితులు కాకుండా కాస్తంత క్లారిటీ ఇవ్వటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక.. ఆలస్యం ఎందుకు వస్తోందన్న విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యులు.. భట్టి విక్రమార్క.. కోమటిరెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డిలాంటి వాళ్లు సీఎం కుర్చీల మీద పేచీలకు పోవటంతోనే.. ఎప్పుడేం జరగాలలో అదేమీ జరగకపోవటాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు కూడా ఇదే పంచాయితీతో పాటు.. మంచి రోజులు లేకపోవటంతో డిసెంబరు 7న ఉదయం 10 గంటల వేళలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదైనా ప్రచారం జరిగినట్లుగా జరిగితే.. ఈ ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందని చెప్పక తప్పదు. మరేం చేస్తారో చూడాలి.