ఈ మాజీ ఎంపీ రూటెటు?

పొన్నం ప్రభాకర్‌. గౌడ సామాజికవర్గానికి చెందిన పొన్నం 2009 ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు.

Update: 2023-08-27 16:52 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 2009లో కాంగ్రెస్‌ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ తరఫున గట్టిగా వాయిస్‌ వినిపించిన నేతల్లో మీడియా ముందు రెగ్యులర్‌ కనిపించేవారు.. పొన్నం ప్రభాకర్‌. గౌడ సామాజికవర్గానికి చెందిన పొన్నం 2009 ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీ స్థానంలో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో అయితే ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు.

2019కి మధ్య 2018లో పొన్నం ప్రభాకర్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొన్నం మూడో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పొన్నం ప్రభాకర్‌ పార్లమెంటు కంటే ముందుగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అయితే ఈసారి కరీంనగర్‌ నుంచి కాకుండా హుస్నాబాద్‌ నియోజకవర్గం పైన పొన్నం ప్రభాకర్‌ కన్నేశారు. ఈ నియోజకవర్గంలో తన సామాజికవర్గమైన గౌడల ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. అందులోనూ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు ఒక్క హుస్నాబాద్‌ నియోజకవర్గం పరిధిలోనే 50 వేలకు పైగా పొన్నంకు ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ నుంచి పోటీ చేయడానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నారు.

మరోవైపు హుస్నాబాద్‌ లో కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ప్రవీణ్‌ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2018లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ కు ఈ సీటు దక్కలేదు. దీంతో ఆయన పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు పోటీకి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్‌ కూడా తనకు హుస్నాబాద్‌ సీటు కావాలని కోరుతుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే ఆయన సోదరుడు పొన్నం తరఫున హుస్నాబాద్‌ సీటు కోసం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. తన ఇష్టదైవమైన పొట్లపల్లి స్వయం భూ రాజరాజేశ్వరుడితో పాటు.. హుస్నాబాద్‌ గుట్టపైనున్న సిద్ధరామేశ్వరుడిని దర్శించుకున్నారు. తాను హుస్నాబాద్‌ నుంచే బరిలోకి దిగనున్నట్టు తెలిపారు.

మరోవైపు పొన్నం ప్రభాకర్‌ ప్రస్తుతం పార్టీ పదవిలో లేరు. తెలంగాణ కాంగ్రెస్‌ లో ముఖ్య నేతలందరికీ ఏదో ఒక పదవిని కట్టబెట్టిన అధిష్టానం తనకు పదవిని ఇవ్వకపోవడంతో అప్పట్లో అలకబాట పట్టారు. ఆ తర్వాత 48 గంటల్లోపు ఏదో ఒక పదవిని ఇస్తామని కాంగ్రెస్‌ పెద్దలు ప్రకటì ంచినా పొన్నంకు పదవి ఇవ్వలేదు. అయినా ఆయన సర్దుకుపోయారు. ఇప్పుడు హుస్నాబాద్‌ సీటును ఆశిస్తున్నారు.

మరోవైపు ఇప్పటికే హుస్నాబాద్‌ లో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి ఇంటింటా తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తనకు సీటు ఇవ్వకుండా పొన్నం ప్రభాకర్‌ కు సీటు ఇస్తే ప్రవీణ్‌ రెడ్డి.. పొన్నంకు సహకరిస్తారా..? అసలు ఇంతకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ప్రవీణ్‌ రెడ్డికా.. లేక, కొత్తగా బరిలోకి దిగుతున్న పొన్నంకా...? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒకవేళ హుస్నాబాద్‌ లో తనకు టిక్కెట్‌ రాకుంటే పొన్నం ఏం నిర్ణయం తీసుకుంటారు? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్‌ తో పొత్తుకు ఆశపడుతున్న కమ్యూనిస్టులు కూడా హుస్నాబాద్‌ సీటును కోరుతున్నారు. దీంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News