మియాపూర్ లో రూ.20 కోట్ల శునకం... కాడాబాం హైడర్ సందడి!
తాజాగా మియాపూర్ లో అత్యంత విలువైన ఒక శునకం హల్ చల్ చేసింది! దీనిని ఆ యజమాని రూ.20 కోట్లు ఖర్చు పెట్టి కొనడం గమనార్హం.
మనిషికీ - శునకానికీ ఉన్న సంబంధం విడదీయలేనిది అని అంటారు. చాలా మంది ఇళ్లల్లో ఆధార్ కార్డులో తప్ప అన్ని విషయాల్లోనూ శునకం కుటుంబ సభ్యుడిగానే ఉంటుంది అని చెప్పినా అతిశయోక్తి కాదు. ఆ బాండింగ్ అలా ఉంటుంది మరి. ఈ సమయంలో తాజాగా కోట్ల రూపాయల విలువ కలిగిన శునకం హైదరాబాద్ లో హల్ చల్ చేసింది. దీన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు!
అవును... తాజాగా మియాపూర్ లో అత్యంత విలువైన ఒక శునకం హల్ చల్ చేసింది! దీనిని ఆ యజమాని రూ.20 కోట్లు ఖర్చు పెట్టి కొనడం గమనార్హం. పైగా ఆ శునకం బ్రీడ్ మామూలుది కాదని, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పోటీల్లో పాల్గొని చాలా పథకాలు కూడా సాధించిందని చెబుతున్నారు. ఈ అరుదైన శునకంతో జనాలు ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు!
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు సతీశ్ ఇటీవల కాకాసియన్ షెపెర్డ్ జాతికి చెందిన శునకాన్ని కనుగోలు చేశారు. దీని ధర అక్షరాలా రూ.20కోట్లట. దీనికి కాడాబాం హైడర్ అని నామకరణం కూడా చేశారు. ఈ శునకం సినిమాల్లో నటిస్తోందని చెప్పారు.
అంతేకాదు సుమా... అంతర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో కూడా పాల్గొని.. ఇప్పటివరకు 32 పతకాలు సాధించిందని యజమాని సతీశ్ తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగే డాగ్ షో కోసం శునకాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ సమయంలో మియాపూర్ లోని విశ్వ పెట్ క్లినిక్ కు హెల్త్ చెక ప్ కోసం ఆ శునకాన్ని తీసుకురావడంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు.
అత్యంత ఖరీదైన కాకాసియన్ షెపెర్డ్ జాతి శునకం హైదరాబాద్ లోని మియాపూర్ కు వస్తుందని తెలియడంతో దాన్ని చూసేందుకు స్థానికులంతా ఎగబడ్డారు. దానితో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.
కాగా... శునకాలను ఎంతో ఇష్టపడే సతీశ్.. గతంలోనూ పలు జాతుల కుక్కలను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు! ఈ క్రమంలో ఇప్పటికే ఆయన దగ్గర రూ.10 కోట్ల విలువైన టిబెటన్ మస్తిఫ్, రూ.8 కోట్ల అలస్కన్ మాలామ్యూట్, రూ.కోటి విలువ గల కొరియన్ డోసా మస్తిఫ్ జాతి కుక్కలున్నాయట!