గద్వాల కోటలో జేజెమ్మకు గెలుపు కష్టాలు!

2018 ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున డీకే అరుణ పోటీ చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-10-25 09:17 GMT

ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.. మాజీ మంత్రి డీకే అరుణ. వచ్చే ఎన్నికల్లో ఆమె గద్వాల నుంచి అసెంబ్లీ బరిలో నిలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కాగా డీకే అరుణ 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గద్వాలలో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్‌ సీటు దక్కకపోవడంతో సమాజవాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009, 2014లోనూ గద్వాల నుంచే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సృష్టించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగానూ పనిచేశారు. 2018 ఎన్నికల్లో డీకే అరుణ ఓడిపోయారు.

2018 ఎన్నికల్లో గద్వాల నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కృష్ణమోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున డీకే అరుణ పోటీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణమోహన్‌ రెడ్డికి 1,00,057, అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలో చేరారు. ఎకాయెకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

తెలంగాణలో మంచి వాగ్ధాటి ఉన్న నేతగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబంపైన ఒంటి కాలితో లేచే నేతగా, ఫైర్‌ బ్రాండ్‌ గా డీకే అరుణకు పేరుంది. వచ్చే ఎన్నికల్లో డీకే అరుణ గద్వాల నుంచి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా అధికార బీఆర్‌ఎస్‌ కు, మరో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీకి షాకివ్వాలని భావిస్తున్నారు.

అయితే గద్వాల కోటలో జేజెమ్మ (గద్వాలలో అరుణను ఆమె అభిమానులు, అనుచరులు ఇలాగే పిలుచుకుంటారు) గెలుపు అంత సులువు కాదంటున్నారు. ఎందుకంటే గద్వాలలో ఇంతవరకు బీజేపీ గెలిచింది లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ పార్టీకి ఇక్కడ పెద్దగా క్యాడరే లేదు. పొలిటికల్‌ ఫైర్‌ బ్రాండ్‌ గా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గుర్తింపు, చరిష్మాపైనే డీకే అరుణ ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి డీకే అరుణ గెలిచి ఉండటం, మంత్రిగా కూడా పనిచేసి ఉండటంతో ఇంకా ఆమె కాంగ్రెస్‌ లోనే ఉన్నారని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావిస్తున్నారట.

ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రజలు ఆ పార్టీకి ఓటేసే ఉద్దేశంతో ఉన్నారట. ఈ నేపథ్యంలో డీకే అరుణ నష్టనివారణ చర్యలకు దిగారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చురుగ్గా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారట. తాను కాంగ్రెస్‌ లో లేనని.. అంతకంటే పెద్ద పార్టీ అయిన బీజేపీలో ఉన్నానని.. మన పార్టీ గుర్తు కమలం అని ఆమె అందరికీ వివరిస్తున్నారట.

అయితే ఇప్పటివరకు గద్వాల నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు.. హస్తం గుర్తు (కాంగ్రెస్‌ పార్టీ), కారు గుర్తు (బీఆర్‌ఎస్‌) తప్ప మరే గుర్తు తెలియదని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ గుర్తు అయిన కమలం గుర్తును వారికి చేరువ చేయడానికి గద్వాల జేజెమ్మ డీకే అరుణ పెద్ద కష్టమే పడుతున్నారని టాక్‌ నడుస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయో, లేదో ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్‌ 3 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News