మాపై చేతబడి-క్షుద్ర పూజలు: డిప్యూటీ సీఎం డీకే సంచలన కామెంట్స్
కేరళలో ప్రత్యేకంగా చేతబడి, క్షుద్ర పూజలు చేయడంలో దిట్టలైన మాంత్రికులను పెట్టి తమపై ఈ పూజలు చేయిస్తున్నట్టు తెలిసిందన్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు కీడు తలపెడుతున్నారని.. ఈ క్రమంలో ఓ పార్టీ నేతలు తమపై చేతబడి సహా క్షుద్ర పూజ లు చేయిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎప్పటి నుంచో కుట్ర చేస్తున్నవారే ఇలా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేరళలో ప్రత్యేకంగా చేతబడి, క్షుద్ర పూజలు చేయడంలో దిట్టలైన మాంత్రికులను పెట్టి తమపై ఈ పూజలు చేయిస్తున్నట్టు తెలిసిందన్నారు.
తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఏర్పడడం కేంద్రంలోని నరేంద్ర మోడీకి రాష్ట్రం లోని జేడీఎస్‌కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. అందుకే తమ ప్రభుత్వం కూల్చేయాలని వారు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. కేరళ మాంత్రికులు రహస్య ప్రాంతంలో తమపై చేతబడి, క్షుద్ర పూజలు చేస్తు న్నట్టు సమాచారం అందిందన్నారు. తమకు వ్యతిరేకంగా శత్రు భైరవి యాగం కూడా చేయిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ క్షుద్ర పూజలను తాము పట్టించుకోబోమని తెలిపారు. తాము ప్రజలనే నమ్ముకున్నామని.. పూజలను కాదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏడాది కాలంగా సుపరిపాలన సాగుతోందని డీకే చెప్పారు. దీనిని చూసి ఓర్చుకోలేక పోతున్నార ని బీజేపీ, జేడీఎస్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు. ``నేను, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని వారు(బీజేపీనా, జేడీఎస్సా అన్నది క్లారిటీ ఇవ్వలేదు) కేరళలో క్షుద్ర పూజలు, చేతబడులు చేయిస్తున్నారు. కేరళలోని రాజరాజేశ్వరి దేవాలయం చుట్టుపక్కల ఉన్న నిర్జన ప్రాంతంలో శత్రువులను చంపేందుకు చేసే రాజకంటకం, మరన్ మోహన స్తంభన యాగం చేస్తున్నారు`` అని డీకే వ్యాఖ్యానించారు.
ఈ యాగం, క్షుద్ర పూజల్లో భాగంగా పంచబలి సమర్పిస్తున్నారని తనకు సమాచారం ఉందని డీకే తెలిపారు. 21 ఎర్ర రంగు మేకలు, 3 గేదెలు, 21 నల్ల రంగు గొర్రెలు, 5 పందులను బలి ఇస్తున్నట్టు తనకు పక్కాగా సమాచారం ఉందన్నారు. అయితే.. తాము ఈ యాగాలకు, పూజలకు భయపడేది లేదన్నారు. ప్రజలను నమ్ముకున్నామని.. ప్రజలతోనే ఉన్నామని చెప్పారు.