అధ్యక్ష ఎన్నికల వేళ.. ట్రంప్ కొత్త వ్యాపారం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా డిబేట్ జరిగింది. అటు నిత్యం ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రసంగాలు ఇస్తూ వారితో సమావేశం అవుతున్నారు. గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఇప్పటికే వీరి మధ్య ఓ ప్రముఖ టీవీ చానల్ డిబేట్ నిర్వహించింది. దేశవ్యాప్తంగానూ ఆ డిబేట్ సంచలనం అయింది. ఆ డిబేట్‌లో కమలా హారిస్ పైచేయి సాధించినట్లుగా పలు మీడియా చానళ్లలో కథనాలు వచ్చాయి.
ఇప్పటికే పలు సర్వేల ప్రకారం కొన్ని చోట్ల హారిస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మరికొన్ని చోట్ల ట్రంప్ ఆధిక్యంతో ఉన్నారు. ముఖ్యంగా అరిజోనా, మిషిగన్, పెన్సిల్వేనియా వంటి ప్రధాన రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమొక్రటిక్ అభ్యర్థి హారిస్ ముందంజలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. మిషిగన్ రాష్ట్రంలో ట్రంప్‌నకు 43శాతం, హారిస్‌కు 48శాతం మద్దతు లభించినట్లు పేర్కొన్నాయి. అటు అరిజోనాలోనూ ట్రంప్‌పై కమలా ఆధిక్యంతో ఉన్నారు.
అయితే.. ఎన్నికల ప్రచారం అంతా ఉత్కంఠగా సాగుతుంటే ట్రంప్ మాత్రం ఈ సమయంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డారు. అఫీషియల్ ట్రంప్ వాచ్ కలెక్షన్ పేరిట వజ్రాలు పొదిగిన వాచీలను విక్రయించే వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే.. మరోవైపు వ్యాపారాన్ని కూడా వదలడం లేదు. 122 డైమండ్లు పొదిగిన 18 గ్యారెట్ల గోల్డ్ స్టైల్ ఒక్కో వాచీని లక్ష అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు. అది భారత కరెన్సీలో సుమారు రూ.83 లక్షలు ఉంది.
గతంలో ట్రంప్ బైబిల్స్, స్నీకర్స్, ఫొటో బుక్స్, క్రిప్టో కరెన్సీ వ్యాపారాలను ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఖరీదైన వాచీల వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ వ్యాపారాన్ని ప్రారంభించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ ఎన్నికల్లో ప్రచారం సాగించాల్సింది పోయి ఈ కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఎందుకని ప్రశ్నలు వస్తున్నాయి. మరి వాటన్నింటికి ట్రంప్ ఎలా బదులిస్తారో చూడాలి..! అటు ఎన్నికలను, ఇటు వ్యాపారాలను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.