డబుల్ రోడ్ అంటే తెలంగాణ.. సింగిల్ రోడ్ అంటే ఏపీ!
బీఆర్ఎస్ చేసిన డెవలప్ మెంట్ గురించి తాను చెప్పటం లేదన్న కేసీఆర్.. ‘‘మనం ఎవరితో విడిపోయామో.. అదే సరిహద్దుల్లో సత్తుపల్లి ప్రజలు ఉన్నారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఏపీని ఉద్దేశించి ఏదో ఒక మాట అనందే నిద్ర పట్టని రీతిలో ఉంటుంది కేసీఆర్ తీరు. విభజన తర్వాత ఎవరి దారి వారిది అని అనుకున్నప్పటికీ.. గులాబీ బాస్ హోదాలో సెంటిమెంట్ ను రగలించటానికి.. భావోద్వేగాన్ని స్ప్రశించేందుకు వీలుగా ఏపీ ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల వేళలోనూ ఆయన ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణ స్టోరీ షురూ చేసిన వేళ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంతలా నష్టపోయింది? ఇప్పుడెంతలా బాగు పడిందన్న మాటను చెప్పటంతో పాటు.. అవసరానికి అనుగుణంగా ఏపీపై పంచ్ లు వేస్తుంటారు. తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన.. ఏపీపై అనూహ్య రీతిలో వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ చేసిన డెవలప్ మెంట్ గురించి తాను చెప్పటం లేదన్న కేసీఆర్.. ‘‘మనం ఎవరితో విడిపోయామో.. అదే సరిహద్దుల్లో సత్తుపల్లి ప్రజలు ఉన్నారు. అవతలివాళ్ల రోడ్లు ఎలా ఉన్నాయో.. మన రోడ్లు ఎలా ఉన్నాయో చూస్తే చాలు. నేను ఎక్కువ చెప్పను. మీరు రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. డబుల్ రోడ్ వచ్చిందంటే తెలంగాణ. సింగిల్ రోడ్ వచ్చిందంటే అది ఆంధ్రా అనేది మీకు కనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
మరో సందర్భంలో.. ‘సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టీవీల ముందు కూర్చొని రాష్ట్రం విడిపోతే తెలంగాణ కటిక చీకటి అవుతుందన్నారు. కారు చీకట్లు కమ్ముకుంటాయన్నారు. ఇవాళ తెలంగాణలో వెలుగుజిలుగులు ఉన్నాయి. ఎవరైతే మనకు శాపం పెట్టారో వాళ్లే చీకట్లో ఉన్నారు తప్పితే మనం లేం. గతంలో ఎక్కడ చూసినా జనరేటర్లు.. ఇన్వర్టర్లు.. స్టెబిలైజర్లు ఉండేవి. మంత్రం వేసినట్లే అవన్నీ మాయమయ్యాయి’ అంటూ మరో పంచ్ విసిరారు.
తాము విడిపోతే.. రాష్ట్రాన్ని పాలించటం వస్తుందా? అంటూ వ్యాఖ్యానించారని.. ఇప్పుడు వాళ్లే వచ్చి మన దగ్గర ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. ‘మన రాష్ట్రంలో ధాన్యం సొమ్ము త్వరగా ఇస్తున్నాం. అందుకే వాళ్లు ఇక్కడికి వచ్చి అమ్ముకునే పరిస్థితి ఉంది’ అంటూ రెండు రాష్ట్రాల మధ్య తేడాను ప్రస్తావిస్తూ మరిన్ని వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
సరిహద్దు జిల్లాగా ఉన్న ఖమ్మంకు ఏపీకి మధ్య సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. తెలంగాణలో డెవలప్ మెంట్ ఎంతలా ఉందన్న విషయాన్ని చెప్పేందుకు ఈ ప్రస్తావన తెచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇక్కడే ఒక వాదన మొదలైంది. తన గొప్ప చెప్పుకోవటానికి ఎదుటోడిని తక్కువ చేసి మాట్లాడటం ఏమిటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే.. కేసీఆర్ మాటల్లో లోగుట్టు లెక్క వేరే ఉందంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సెటిలర్లు గులాబీ పార్టీకి దూరమయ్యారని.. వారిని ఆకర్షించేందుకు వీలుగా ఇప్పుడున్న ప్రభుత్వానికి పంచ్ లు వేసినట్లుగా వేయటం ద్వారా.. వారిని ఆకర్షించేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటున్నారు. అయితే.. కొందరిని ఆకర్షించేందుకు మాట్లాడే మాటలతో.. మరికొందరు దూరం అవుతారన్న లెక్క కేసీఆర్ మిస్ కావటం గమనార్హం.