మోడీతో భేటీ వేళ మొత్తం పిల్లల్ని తీసుకొచ్చిన మస్క్
ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉండటం తెలిసిందే.
ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ దేశానికి అధ్యక్షుడితో అధికారిక భేటీకి ఎవరైనా ఎలా వెళతారు? అలా వెళితే ఆయన ఎలాన్ మస్క్ ఎందుకు అవుతారు? ప్రపంచ కుబేరుడైన ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడేందుకు వెళ్లిన సందర్భంగా వైట్ హౌస్ కు తన నాలుగేళ్ల కొడుకును తీసుకెళ్లటం ఒక ఎత్తు అయితే.. అతగాడిని భుజాల మీద ఎక్కించుకొని మరీ మీడియాతో మాట్లాడటం చూసినోళ్లు అవాక్కు అయ్యారు. కట్ చేస్తే.. తాజాగా ఈసారి సీన్ మోడీ భేటీ వేళ చోటు చేసుకుంది.
ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉండటం తెలిసిందే. ఆయన బస చేసిన హోటల్ కు భార్య.. ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చిన ఎలాన్ మస్క్.. భేటీ వేళలో ముగ్గురు పిల్లల్లో ఒకరు తల్లి దగ్గరే ఉండగా.. మిగిలిన ఇద్దరు ఫ్లోర్ మీద కూర్చొని రాసుకుంటూ.. ఆడుకుంటూ ఉన్న ఫోటో ఆసక్తికరంగా మారింది. ఓవైపు భారత ప్రధాని మోడీతో చర్చలు జరుపుతున్న మస్క్.. మరోవైపు పిల్లలు అక్కడే ఉండటం.. దీనికి సంబంధించిన వీడియోలు ఆసక్తికరంగా మారాయి.
ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అంతరిక్ష రంగాల్లో భారత్ కీలకంగా మారుతున్న వేళ.. మోడీ - మస్క్ లభేటీ భారత మార్కెట్ తో మస్క్ కంపెనీల బంధం బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పాటైన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి మస్క్ సారథ్యం వహించటం తెలిసిందే. ఏమైనా అధికారిక చర్చల వేళలో ఇలా పిల్లల్ని తీసుకొచ్చిన వైనం కొత్త ట్రెండ్ గా చెప్పాలి. రానున్న రోజుల్లో అధికారిక కార్యక్రమాల్లో చంటి పిల్లలు.. వారితో ముచ్చట్లు చెప్పే ప్రముఖుల ఫోటోలు మరిన్ని రానున్నాయా? మస్క్ ను మిగిలిన సంపన్నులు ఫాలో అవుతారా? వారికి అంత ధైర్యం ఉందా? అన్నది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.