కమలకు లోకేషన్, ట్రంప్ కు న్యూస్... గూగుల్ పై మస్క్ పోస్ట్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. గూగుల్ పై గతంలో తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. గూగుల్ పై గతంలో తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే గూగుల్ సెర్చ్ ఇంజిన్ పై విచారణ చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ట్రంప్ విషయంలో గూగుల్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయ్యేలా ఎలాన్ మస్క్ ఓ పోస్ట్ చేశారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న వేళ ఓటుకు సంబంధించి హారిస్, ట్రంప్ ల విషయంలో గూగుల్ సెర్చ్ లో వేర్వేరు సమాధానాలు వస్తున్నాని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ప్రస్థావించారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేశారు. దీంతో... ఈ వ్యవహారంపై గూగుల్ స్పందించింది. దీనిపై వివరణ ఇచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఓటింగ్ కు ఓటర్లు బారులు తీరారు. ఈ సమయంలో ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సమయంలో "హారిస్ కు ఓటు ఎక్కడ వేయగలను?" అని గూగుల్ లో సెర్చ్ చేస్తే... పోలింగ్ సెంటర్ ఎక్కడుందో చెప్పే మ్యాప్ తో కూడిన విండో ఓపెన్ అవుతోంది.
అయితే... ఇదే సెర్చ్ ట్రంప్ విషయలో చేస్తే... కేవలం వార్తలకు సంబంధించిన విండో మాత్రం వస్తోంది. దీంతో... ఈ విషయాన్ని వీడియోతో సహా ఎక్స్ వేదికగా ఎత్తిచూపిన ఓ పోస్ట్ ని ఎలాన్ మస్క్ షేర్ చేశారు. దీంతో... ఇది వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కి 3 గంటల వ్యవధిలో 24 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఈ స్థాయిలో ఇది వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారంపై గూగుల్ వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా కమలా హారిస్ పేరిట టెక్సాస్ లో ఓ కౌంటీ ఉందని.. రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్ పేరిట కూడా ఓ కౌంటీ ఉందని పేర్కొంది. దీంతో... సెర్చ్ సమయంలో వేర్వేరు సమాధానాలు వస్తున్నాయని.. దీని పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది.
ఇదే సమయంలో... చాలా కొద్ది మంది మాత్రమే ఈ విధంగా ఓటింగ్ కేంద్రాల కోసం సెర్చ్ చేస్తున్నారని తెలిపింది. దీంతో.. ఈ వివరణకు మస్క్ థాంక్స్ చెప్పారు!