మస్క్ సంచలనం... జీ-మెయిల్ కు ప్రత్యామ్నాయంపై హాట్ కామెంట్స్!
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఏమి మాట్లాడినా, ఏ విషయంపై స్పందించినా అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతుంటుంది
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఏమి మాట్లాడినా, ఏ విషయంపై స్పందించినా అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతుంటుంది. ఆయన స్పందించాడు కాబట్టి అది వైరల్ గా మారుతుందా.. లేక, ఆయన స్పందించే విషయాలన్నీ వైరల్ గా మారడానికి అర్హత ఉన్న విషయాలవ్వడం వల్లనేనా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా మరో వైరల్ రియాక్షన్ ఇచ్చారు ఎలాన్ మస్క్. ఇందులో భాగంగా... జీ-మెయిల్ కు ప్రత్యామ్నయంపై స్పందించారు.
అవును... త్వరలో ఎక్స్-మెయిల్ అనే ఇ-మెయిల్ సేవను ప్రారంభించనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీని ద్వారా సత్య నాదెళ్ల నేతృత్వంలోని గూగుల్ తో నేరుగా పోటీ పడేందుకు మస్క్ సిద్ధమయినట్లు తెలుస్తుంది! తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ ఫారం "ఎక్స్" లో స్పందించిన మస్క్.. త్వరలో ఎక్స్-మెయిల్ ను ప్రారంభిస్తామని, ఇది జీ-మెయిల్ కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
తాజాగా ఎక్స్ ఇంజినీరింగ్ సెక్యూరిటీ టీం మెంబర్ నేట్ మెక్ గ్రాడీ “ఎక్స్” వేదికగా స్పందిస్తూ... "మీరు ఇ-మెయిల్ సేవను ప్లాన్ చేస్తున్నారా?" అని అడిగారు. దీనిపై స్పందించిన ఎలాన్ మస్క్.. "వస్తుంది" అంటూ స్పందించారు. దీంతో... గతకొంతకాలంగా జీ-మెయిల్ త్వరలో మూసుకుపోబోతుందంటూ వస్తున్న పుకార్ల నడుమ మస్క్ ఇలా రియాక్ట్ అయ్యారా.. లేక, ఇది ముందునుంచీ ఉన్న ప్లానేనా అనేది ఆసక్తిగా మారింది.
మరోపక్క జీ-మెయిల్ త్వరలో షట్ డౌన్ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ఫేక్ విషయం సర్క్యులేట్ అవుతుండటంపై యూజర్లలో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన గూగుల్... జీ-మెయిల్ షట్ డౌన్ కాదని.. తమ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కాగా త్వరలో జీ-మెయిల్ కి సంబంధించిన హెచ్.టి.ఎం.ఎల్. వెర్షన్ ఈ ఏడాది నుంచి నిలిపివేయబడుతుంది. జనవరి 2024 తర్వాత గీ-మెయిల్ అందరికీ రెగ్యులర్ వెర్షన్ లోనే కనిపిస్తుంది. ఈ విషయంలో 2023లోనే స్పందించిన గూగుల్... 2024లో హెచ్.టి.ఎం.ఎల్. వెర్షన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా.. తన సేవను మరింత మెరుగుపరిచేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లను విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే!