ఆ దంపతుల రాజీనామాతో ఏలూరులో వైసీపీ ఖాళీ

అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోయినట్లుగా కనిపించే పార్టీ.. దన్నుగా నిలిచే నేతలతో కళకళలాడిపోతూ ఉంటుంది.

Update: 2024-09-06 04:57 GMT

అధికారంలో ఉన్నప్పుడు వెలిగిపోయినట్లుగా కనిపించే పార్టీ.. దన్నుగా నిలిచే నేతలతో కళకళలాడిపోతూ ఉంటుంది. ఒక పార్టీ అసలు బలం.. ఆ పార్టీ చేతిలో అధికారం లేనప్పుడే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పలుమార్లు క్లిష్టమైన పరీక్షల్ని ఎదుర్కొంది. తాజాగా వైసీపీ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. మొన్నటివరకు అధికారపార్టీగా ఒక వెలుగు వెలిగిన వైసీపీ.. ఈ మధ్య జరిగిన ఎన్నికలతో ఘోర ఓటమిని మూటకట్టుకోవటం తెలిసిందే. టీడీపీ కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత పలు జిల్లాల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా అలాంటి దెబ్బే ఏలూరులో ఎదురైంది.

ఇప్పటివరకు ఒకరు తర్వాత ఒకరు చొప్పున వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయటం తెలిసిందే. తాజాగా ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ.. ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావులు పార్టీకి రాజీనామా చేయటంతో ఏలూరులో పార్టీ ఖాళీ అయిన పరిస్థితి. తాజాగా ఈ దంపతులు తమ రాజీనామా లేఖల్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. ఏలూరు జెడ్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వీరిద్దరు తాము వైసీపీకి రాజీనామా చేస్తున్నామని.. జనసేనలోకి వెళుతున్నట్లుగా ప్రకటించారు.

అధికారంలో ఉన్నంతవరకు ఏలూరులో వైసీపీకి తిరుగులేదన్నట్లుగా కనిపించింది. ఆళ్ల నాని మొదలుకొని పేరున్న నేతలంతా పార్టీలోనే ఉండేవారు. అధికారం చేజారిన తర్వాత నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మొదలు పెట్టారు. ఆళ్ల నాని.. ఏలూరు మేయర్ నూర్జహాన్.. పెదబాబు దంపతులు.. ఇడా మాజీ ఛైర్మన్ బొద్దాని శ్రీనివాస్.. ఏలూరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు.. పార్టీకి చెందిన ఏలూరు మున్సిపాల్టీకి చెందిన 19 మంది కార్పొరేటర్లు.. ఇలా వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ పార్టీని వీడారు. కొందరు టీడీపీలో చేరితే.. మరికొందరు జనసేనలో చేరుతున్నారు. తాజాగా జెడ్పీ ఛైర్మన్ దంపతులు జనసేన గొడుగు కిందకు వస్తున్నట్లు ప్రకటించారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ లో 48 మంది జడ్పీటీసీ సభ్యులు ఉంటే.. వీరిలో టీడీపీకి ఒకరు.. జనసేన తరఫు మరొకరు మాత్రమే ఉండేవారు. మిగిలిన 46 మంది వైసీపీకి చెందిన వారే. అయితే.. ఎన్నికల ఫలితాల తర్వాత కఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్లిపోయారు. తాజాగా జడ్పీ ఛైర్ పర్సన్ పద్మశ్రీ దంపతులు రాజీనామా చేయటంతో.. మిగిలిన వారంతా తమ దారి తాము చూసుకుంటారని చెబుతున్నారు.

మరోవైపు ఏలూరు నగర పాలక సంస్థలోనూ ఇలాంటి సీన్ కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. మేయర్ దంపతులతో పాటు బొద్దాని మైబాబు కూడా టీడీపీ తీర్థం తీసుకున్నారు. దీంతో.. ప్రతిపక్షం లేకుండాపోయింది. మరో 15 మంది కార్పొరేటర్లతో పాటు ఇంకొంతమంది ద్వితీయ శ్రేణి వైసీపీ నేతలంతా పార్టీకి రాజీనామా చేసి సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఏలూరులో వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయిన దుస్థితి.

Tags:    

Similar News