కొత్త ట్రెండ్... బాస్, కొలీగ్స్ ఫర్ సేల్!

అవును... ఆఫీసుల్లో ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల ఉద్యోగులు తీవ్ర సంఘర్షణకు లోనవుతుంటారు.

Update: 2024-07-08 15:30 GMT

ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో బాస్ తో, మరికొన్ని సందర్భాల్లో కొలీగ్స్ తో ఇబ్బందులు ఎదురవుతుండటం సహజం! అయితే కొన్ని సార్లు ఈ తరహా ఒత్తిడి మరీ ఎక్కువైపోతుంటుంది. దీంతో ఫ్రెండ్స్ తో బార్ కెళ్లి బాస్ ని తిట్టుకోవడం కాకుండా.. ఈ తరహా సమస్యల నుంచి బయట పడేందుకు చైనాలోని ఉద్యోగులు కొత్త తరహా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా... బాస్ ఫర్ సేల్, కొలీగ్స్ ఫర్ సేల్ అని ప్రకటనలు ఇస్తున్నారు!

అవును... ఆఫీసుల్లో ఎదురయ్యే కొన్ని సమస్యల వల్ల ఉద్యోగులు తీవ్ర సంఘర్షణకు లోనవుతుంటారు. ఈ సమయంలో చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, ఆ కోపం మరోచోట చూపించి సమస్యలు తెచ్చిపెట్టుకోవడం చేస్తుంటారు! అయితే... చైనాలో మాత్రం తమకు నచ్చని బాస్ లను, కొలీగ్స్ ని.. ఉద్యోగులు సెకండ్ హ్యాండ్ ఈ-కామర్స్ వెబ్ సైట్ లలో విక్రయానికి పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ చైనాలో వైరల్ గా మారింది.

ప్రధానంగా ఈ కొత్త ట్రెండ్ కి అలీబాబాకు చెందిన సెకండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫాం క్జియాన్ యూ వేదికగా నిలుస్తోంది! పని ఒత్తిడి, ఆఫీసు వాతావరణంలో విసిగిపోయిన పలువురు ఉద్యోగులు.. తమకు ఇష్టం లేని బాస్ లు, కొలీగ్స్ ని వెబ్ సైట్ లో లిస్టింగ్ కు పెడుతున్నారు. ఈ మేరకు మూడు కేటగిరీలు సృష్టించారు. ఇందులో భాగంగా... "బాధించే బాస్ లు", "అసహ్యంచుకునే కొలీగ్స్", "భయం పుట్టించే ఉద్యోగాలు" అనే నామకరణాలు చేశారు.

ఈ క్రమంలో తాజాగా ఓ మహిళా ఉద్యోగి తన కొలీగ్ ని అమ్మేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు అతడికి 3,999 యువాన్లకు (సుమారు రూ.46వేలు) అమ్మాలనుకున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో అతడి వల్ల బలవ్వకుండా, ఎలా మసులుకోవాలో 10 చిట్కాలు కూడా చెప్తానని ఆఫర్ పెట్టింది. మరో ఉద్యోగి... అస్తమానం అవమానపరుస్తున్నాడంటూ తన బాస్ ని 500 యువాన్లు (సుమారు రూ.5,750) కు అమ్మకానికి పెట్టాడు.

అయితే ఇదంతా నిజం అమ్మకం కాదు! ఆఫీసుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల వస్తోన్న మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చైనాలో పలువురు ఉద్యోగులు అనుసరిస్తున్న ఓ విధానం మాత్రమే. దీన్నే అక్కడ "వర్క్ స్మైల్" అని పిలుస్తున్నారు. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత... తమను ఇబ్బంది పెట్టేవారిని ఇలా ఆన్ లైన్ లో అమ్మకానికి పెడితే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారంట.

Tags:    

Similar News