కూటమి గెలిచినా కాశ్మీర్ బీజేపీ చేతిలోనే ?
దానికి కారణం కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తరువాత తొలిసారి జరిగిన ఎన్నికలు.
దేశంలో రెండు రాష్ట్రాల ఫలితాలు ప్రజలందరికీ ఉత్కంఠ కలిగించాయి. దేశాన్ని ఏలే బీజేపీ ఈ రెండు రాష్ట్రాలలో ఎలా తన రాజకీయ ప్రదర్శన చేస్తుంది అన్నది అందరిలోనూ ఆసక్తి బాగా పెరిగిపోయింది. దానికి కారణం కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తరువాత తొలిసారి జరిగిన ఎన్నికలు.
అంతే కాదు దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో కంటే ఎక్కువగా కాశ్మీర్ అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో కేంద్రం స్పెషల్ గ్రాంట్స్ ని సైతం వెచ్చించి ఖర్చు చేసింది. అక్కడ అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తోంది. దానికి ప్రజలు అంగీకరిస్తున్నారు కూడా.
అయితే కాశ్మీర్ లోయలో మాత్రం బీజేపీకి ఒక్క సీటు దక్కలేదు. జమ్మూలోనే ఉన్న 43 సీట్లలోనే బీజేపీ గెలుచుకుంటూ వస్తోంది. అలా 29 దాకా సీట్లతో అతి పెద్ద పార్టీగా ఉంది. ఇక కాశ్మీర్ లో మొత్తం సీట్లు 90 అయితే మరో అయిదురుగుని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. వారంతా బీజేపీకి చెందిన వారే ఉంటారు అనడంతో సందేహం లేదు. అలా బీజేపీ ఈసారి బలమైన ప్రతిపక్ష పాత్రను కాశ్మీర్ లో పోషించబోతోంది.
ఇక నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ ని సాధించి అధికారం అందుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే కాశ్మీర్ జమ్మూ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం ఉంచింది. దాంతో కాశ్మీర్ లో పరిస్థితి కూడా అచ్చం ఢిల్లీ మాదిరిగానే ఉంటుంది. ఇంకా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి.
లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం తన పరోక్ష అధికారాలను చలాయించే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. 2019లో జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్ర హోదా రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి కేంద్రం చట్టం చేసింది. దాంతో ఇపుడు బీజేపీకి ఇది అడ్వాంటేజ్ గా మారబోతోంది. అక్కడ ప్రజలు నెగ్గించిన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కానీ అదే సమయంలో అపరిమితమైన అధికారాలు ఏవీ ఉండవు.
లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర పాలిత ప్రాంతాలలో కీలకంగా ఉంటారు అన్నది తెలిసిందే. నిజానికి బీజేపీ కనుక కాశ్మీర్ లో అధికారం అందుకుంటే రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని అనుకుంది. కానీ ఫలితాలు తేడా కొట్టడంతో బీజేపీ ఆ ఆలోచనలు చేయదని అంటున్నారు.
దాంతో కాశ్మీర్ లో కూటమి ప్రభుత్వం పరిమితమైన అధికారాలలో పాలన చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు కాశ్మీర్ లో మరింత పట్టు సాధించేందుకు బీజేపీ తనకు దక్కిన ఈ అవకాశాన్ని అధికారాన్ని మార్చుకుంటుందని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే ఉగ్రవాదం గతంతో పోలిస్తే కాశ్మీర్ లో బాగా తగ్గింది. కానీ ఇంకా అది ఉంటూనే ఉంది. ఇపుడు అక్కడ లోకల్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి రావడంతో ఏ విధంగా ఉండబోతోంది అన్నది కూడా తేలుతుంది అని అంటున్నారు. అదే విధంగా కాశ్మీర్ ని అంత తేలిగ్గా బీజేపీ వదిలిపెట్టదని అంటున్నారు
కాశ్మీర్ ని తన పరోక్ష నియంత్రణలో ఉంచుకునే అక్కడ ఎంతమేర కూటమి ప్రభుత్వం ఉండాలో అంతవరకే ఉండనిస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఇల్లు అలకగానే సంబరం కాదు అన్నట్లుగానే కూటమి పరిస్థితి ఉంటుందా అన్న చర్చ అయితే ఉంది. కాశ్మీర్ విషయంలో బీజేపీ ఇప్పటికి సగం విజయమే సాధించింది, ఇంకా పూర్తి విజయం సాధించాల్సి ఉందని అక్కడి ఫలితాల తరువాత బీజేపీ నేతలు అంటున్నారు. ఆ ఫలితాలు వచ్చేవరకూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా అన్నది దక్కదు అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.