పోటీలో ఉన్న తండ్రీకొడుకులు వీరే!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది

Update: 2024-03-22 15:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అభ్యర్థులంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు.

కాగా ఈసారి ప్రధాన పార్టీల తరఫున తండ్రీకొడుకులు బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది. అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష టీడీపీ సైతం పలుచోట్ల తండ్రీకొడుకులకు సీట్లిచ్చాయి.

ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ యాదవ సామాజికవర్గం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. అధికార వైసీపీ తరఫున కారుమూరి సునీల్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈయన వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు. మరోవైపు కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి వైసీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

ఇక టీడీపీ తరఫున ఏలూరు ఎంపీగా పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. పుట్టా మహేశ్‌ తండ్రి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉండటం విశేషం. ఇలా తండ్రీకొడుకులు ఇద్దరూ బరిలో ఉన్నారు. అంతేకాకుండా పుట్టా మహేశ్‌ కుమార్‌ యాదవ్‌.. టీడీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు కావడం విశేషం. యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి పోటీ చేస్తున్నారు.

అలాగే భార్యభర్తలు కూడా పోటీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో ముఖ్య నేత, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా ఆయన భార్య బొత్స ఝాన్సీలక్ష్మి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అలాగే మంత్రి బొత్స సోదరుడు బొత్స అప్పలనరసయ్య నెల్లిమర్ల నుంచి పోటీలో ఉన్నారు.

అలాగే అన్నదమ్ములు ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేట నుంచి వైసీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి బరిలో ఉండగా ఆయన కుమారుడు నారా లోకేశ్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తుండగా ఆయన ఇద్దరు అల్లుళ్లు.. లోకేశ్‌ మంగళగిరి నుంచి, ఇంకో అల్లుడు భరత్‌ విశాఖపట్నం ఎంపీగా బరిలో ఉన్నారు.

Tags:    

Similar News