తప్పుడు ప్రచారం వద్దు.. అర్థరాత్రి చార్మినార్ దగ్గర జరిగింది ఇదే
హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద ఆలిండియా సున్నీయునైటెడ్ ఫోరం మిలాద్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా అనూహ్య రీతిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
అనుకోనిది ఏదైనా జరిగినప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అందునా.. సున్నిత ప్రాంతాల్లో ఏదైనా అనూహ్య ఘటనకు మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి వేళలో ఎవరు హద్దు మీరినా వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గురువారం అర్థరాత్రి ప్రాంతంలో అనూహ్య రీతిలోచార్మినార్ వద్ద చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి అసలేం జరిగింది? అనే విషయం కంటే కూడా.. సదరు ఫైర్ యాక్సిడెంట్ వేళ.. ఎవరికి వారు.. తమకు తోచిన విషయాల్ని ప్రచారం చేసిన వైనం చూస్తే.. ఒళ్లు మండాల్సిందే.
హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద ఆలిండియా సున్నీయునైటెడ్ ఫోరం మిలాద్ ర్యాలీని నిర్వహించింది. ఈ సందర్భంగా అనూహ్య రీతిలో ఒక అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ర్యాలీలో భాగంగా ఒక యువకుడు టపాసులు కాల్చాడు. అది కాస్తా దీజే సౌండ్ సిస్టం మీద పడింది. పక్కనే ఉన్న జనరేటర్ పై నిప్పు రవ్వలు పడ్డాయి. దీంతో.. అనూహ్య రీతిలో మంటలు ఎగిసాయి.
చార్మినార్ కు కూతవేటు దూరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించారు. ఫైరింజన్లకు సమాచారం ఇవ్వటంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మంటలు ఒక మోస్తరుగా వ్యాపిస్తున్న వేళ.. స్పందించిన అగ్నిమాపక దళం.. మంటల్నిఆర్పేసింది. ఈ క్రమంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. కాకుంటే.. చార్మినార్ కు కూతవేటు దూరంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంపై ఎవరికి వారు తమకు తోచిన రీతిలో వ్యాఖ్యలుచేశారు.
అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడి వారిని మంటలకు దూరంగా ఉంచారు. ఈ క్రమంలో పోలీసులు సరైన తీరును ప్రదర్శించారు. కాకుంటే.. పోలీసుల మీద తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారు కొందరు. ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్లుగా వదంతులు వ్యాపించే ప్రయత్నం చేశారు.
దీంతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు.చివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సైతం అర్థరాత్రి వేళ.. హుటాహుటిన చార్మినార్ ప్రాంతానికి రావటమే కాదు.. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న వైనం గురించి తెలుసుకోవటమే కాదు.. అసలేం జరిగిందన్న విషయాన్ని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. అనూహ్యంగా చోటు చేసుకున్న మంటలను సకాలంలో స్పందించిన పోలీసుల కారణంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి.