రేణుకకు దారి కనబడటం లేదా ?

ఫెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకకు రాజకీయంగా ఎలాంటి దారి కనబడటం లేదట

Update: 2023-08-05 04:53 GMT

ఫెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకకు రాజకీయంగా ఎలాంటి దారి కనబడటం లేదట. రాజకీయాల్లో ఎలాంటి నేపథ్యం లేకపోయినా 2014 ఎన్నికల్లో బుట్టా రేణుకను పిలిచి జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీగా టికెట్ ఇచ్చారు. కాలం కలిసొచ్చి రేణుక మంచి మెజారిటితో గెలిచారు. రాజకీయ నేపధ్యం లేకపోయినా పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే గెలిచిన రేణుకను అందరు బ్రహ్మాండమన్నారు. అయితే గెలిచిన కొంతకాలానికే ఆమె ప్రలోభాలకు లొంగి టీడీపీలోకి ఫిరాయించారు.

టీడీపీలోకి ఫిరాయించే ముందు ఆమెకు ఎలాంటి హామీలు లభించాయో తెలీదు కానీ అవేవీ నెరవేరలేదు. దాంతో అక్కడ ఉండలేక 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీలో చేరిపోయారు. వైసీపీలోకి వచ్చేముందు రేణుకకు జగన్ ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఆ ఎన్నికలో పార్టీకి పనిచేస్తే 2024 ఎన్నికల్లో అయినా ఎక్కడో టికెట్ ఇవ్వకపోతారా అనే ఆశతో ఆమె కూడా పార్టీలో చేరారు. అయితే షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా ఆమె పరిస్ధితి ఏమిటో ఆమెకే తెలియటంలేదట.

రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎంఎల్ఏగా పోటీచేయాలని ఈ మాజీ ఎంపీ అనుకుంటున్నారు. ఇందుకు ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాలను ఎంపికచేసుకున్నారట. అయితే ఎక్కడ పోటీ చేయాలనే విషయాన్ని డిసైడ్ చేయాల్సింది జగన్. జగనేమో ఈమె విషయంలో ఏమీ మాట్లాడటం లేదు. మాట్లాడేందుకు కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వటంలేదట. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచటం లేదు.

ఎందుకంటే ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి, పత్తిపాడులో శ్రీదేవి సిట్టింగ్ ఎంఎల్ఏలున్నారు. వాళ్ళని కాదని బుట్టాకు టికెట్ ఇచ్చే అవకాశంలేదు. పోనీ కర్నూలు ఎంపీ విషయం ఆలోచిద్దామంటే అక్కడా డాక్టర్ సంజీవరావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. జిల్లా మొత్తం వైసీపీ ఎంఎల్ఏలు, ఎంపీలే ఉన్నారు కాబట్టి రేణుకకు పోటీచేసే అవకాశమే లేదు. జగన్ ఏదైనా దయచూపిస్తే ఎంఎల్సీగా అవకాశం వస్తే రావచ్చు. అనాలోచితంగా చేసిన తప్పు రేణుక రాజకీయ జీవితాన్ని బాగా దెబ్బకొట్టేసిందని అర్ధమవుతోంది. ఆమె కూడా ఇదే విషయం చెప్పుకుని సన్నిహితుల దగ్గర బాధపడిపోతున్నారట. దీన్నే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటారు.

Tags:    

Similar News