పవర్ లోకి రాలేదు.. చెత్త పన్నుకు చెక్ పెడుతూ ఆదేశాలు

అయితే.. లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ కాలేదు కానీ మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి.

Update: 2024-06-08 04:03 GMT

ఆంధ్రప్రదేశ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి బరిలోకి దిగటం సంచలన విజయాన్ని నమోదు చేయటం తెలిసిందే. అధికారికంగా ఎన్డీయే సర్కారు కొలువు తీరక ముందే.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన చెత్త పన్నురద్దుకు సంబంధించిన ఆదేశాలు తాజాగా జారీ కావటం ఆసక్తికరంగా మారింది. అయితే.. లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ కాలేదు కానీ మౌఖిక ఆదేశాలు వెలువడ్డాయి.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో చెత్తపన్నును రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే తన ప్రసంగాల్లో చెప్పేవారు. దీన్ని తమ ఎన్నికల హామీగా కూడా ఆయన ఇచ్చేశారు. స్థానిక సంస్థల నుంచి పట్టణాలు.. నగరాల వరకు నెలకు రూ.30 నుంచి రూ.150 వరకు చెత్తపన్ను వేసి రూ.200 కోట్ల మేర ఆదాయాన్ని గత ప్రభుత్వం ఆర్జించింది. ఎన్నికల ముందు తాత్కాలికంగా ఈ చెత్త పన్ను వసూళ్లను నిలిపేశారు.

చెత్తపన్ను వసూళ్లను టీడీపీతో పాటు జనసేన సైతం వ్యతిరేకిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత చెత్తపన్ను వసూళ్లను ఆపేయాలని పేర్కొంటూ మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. క్లీన్ ఏపీ పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించే విధానాన్ని షురూ చేసి.. ప్రతి నెలా వసూళ్లు చేపట్టే వారు. జనాల నుంచి చెత్త పన్ను పేరుతో డబ్బులు వసూలు చేసేవారు. అదే సమయంలో వాటిని రవాణా చేసే ఆటోడ్రైవర్లకు నెలకు రూ.18వేల చొప్పున జీతాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వారికి రూ.13 వేలకు మించి ఇవ్వని పరిస్థితి. దీంతో.. వారు గడిచిన నెలగా సమ్మె చేస్తున్నారు. దీంతో.. పాత పద్దతిలోనే చెత్తను సేకరిస్తున్నారు. ఈ చెత్తసేకరణ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన ఆటోల వ్యవహారంపైనా పలు విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగాచంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరక ముందే చెత్త పన్ను వసూళ్లపై మౌఖికంగా జారీ చేసిన ఆదేశాలు ఏపీ ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News