ష్.. ఆ సాధారణ అభ్యర్థి ఆస్తి రూ.వెయ్యి కోట్లు!

హైదరాబాద్ పరిధిలోని కీలక ప్రాంతం అది. ఒకప్పుడు శివారులో ఉన్నప్పటికీ ఇప్పుడు సిటీలోకి వచ్చేసింది.

Update: 2023-11-09 15:30 GMT

గత రోజుల్లో కోటీశ్వరులంటే వందల ఎకరాల భూములు.. పెద్ద పరిశ్రమలు.. భారీ భవనాలు.. పెద్ధఎత్తున బంగారం.. ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ వారు వేలకోట్లకు అధిపతి అని చెప్పలేం.. కానీ, ఈ రోజుల్లో అలాకాదు. ఖరీదైన పారంతంలో కేవలం పది ఎకరాలున్నా చాలు.. తక్కువలో తక్కువ వందకోట్లకు అధిపతి అని అనుకోవచ్చు. ఇలానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ‘అనధికారిక’ ఆస్తి రూ.వెయ్యికోట్లు ఉంటుందని చెబుతున్నారు.

స్థానిక నాయకుడిగా

హైదరాబాద్ పరిధిలోని కీలక ప్రాంతం అది. ఒకప్పుడు శివారులో ఉన్నప్పటికీ ఇప్పుడు సిటీలోకి వచ్చేసింది. కొంచెం ప్రశాంతత కావాలనుకుంటున్నవారు ఆ ప్రాంతంలోకి వెళ్లి స్థిరపడుతుండడంతో అక్కడ భూముల రేట్లు భారీగా పెరిగాయి. అక్కడే కాదు.. తెలంగాణలో ఎక్కడైనా ఇప్పుడు భూమి బంగారం అనే సంగతి తెలిసిందే. ఇక హైదరాబాద్ నగరం గురించి చెప్పేదేముంది? అలాంటి ఓ ప్రాంతానికి చెందిన నాయకుడు ఆయన. వాస్తవానికి ద్వితీయ శ్రేణి నాయకుడు. అయితే, చురుకుదనం ఉన్నవారు. గతంలో స్థానిక సంస్థల ప్రతినిధిగానూ పనిచేశారు. ఆ హయాంలో పనితీరు పరంగా ప్రశంసలు ఆరోపణలు రెండూ ఎదుర్కొన్నారు.

టికెట్ కొట్టేసి సంచలనం

హైదరాబాద్ పాత బస్తీ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న నియోజకవర్గ నాయకుడైన ఆయన ఇటీవల ప్రధాన పార్టీ టికెట్ సాధించారు. వాస్తవానికి ఆయనకు టికెట్ ఖాయమని రెండేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, దానిని ఎవరూ నమ్మలేదు. ఆఖరికి మీడియా ప్రతినిధులు కూడా విశ్వసించలేదు. అయితే, జాతీయ పార్టీ టికెట్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా, ఈ అభ్యర్థిది సాదారణ నేపథ్యమే. తాతలు తండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులేమీ పెద్దగా లేవు. కాకపోతే.. హైదరాబాద్ శివారులో.. ఇటీవల ప్రభుత్వం భూములు వేలం వేసిన ప్రాంతంలో ఆయనకు ఓ 9 ఎకరాలు ఉంది. కొన్ని నెలల కిందట సర్కారు వేలం పాటలో ఈ ప్రాంతంలో ఎకరం రూ.100 కోట్లకు పైమాటే పలికింది. ఈ లెక్కన ఆ జాతీయ అభ్యర్థి ఆస్తి రూ.వెయ్యి కోట్లపై మాటేనని అంటున్నారు. అయితే, ఇదంతా ఆయన కష్టార్జితంతో గతంలో కొనుక్కున్నదని, కుటుంబం నుంచి కూడా కొంత వచ్చిందని స్థానికులు వివరిస్తున్నారు. కాగా, ఈయన 9 ఎకరాలు ఉన్నచోటుకు అటుఇటుగా గతంలో ప్రభుత్వాలు సమాజంలో ఉన్నతమైన రెండు వర్గాలకు స్థలాలు కేటాయించింది. ఒక వర్గం వారి భూమి వివాదం నుంచి బయటపడి సొసైటీ సభ్యులకు దక్కింది. మరో వర్గం వారు మాత్రం కోర్టు కేసుల చిక్కుముడిలో ఇరుక్కుని 15 ఏళ్లుగా వ్యథ అనుభవిస్తున్నారు. ఏడాది కిందటనే వారికి అనుకూలంగా సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించినా.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు.

Tags:    

Similar News