లేడీ ఆఫీసర్ దారుణ హత్య... మైనింగ్ మాఫియా పనేనా?

సిన్సియర్ గా పనిచేసే అధికారుల హత్యలు సినిమాల్లో కనిపించినట్లుగానే నిజజీవితంలో కూడా జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం

Update: 2023-11-06 15:59 GMT

సిన్సియర్ గా పనిచేసే అధికారుల హత్యలు సినిమాల్లో కనిపించినట్లుగానే నిజజీవితంలో కూడా జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. సిన్సియర్ గా పనిచేసే మహిళా ఎమ్మార్వో కి గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన సంగతి తెలిసిందే. ఇదె క్రమంలో దేశంలో మరికొన్ని సంఘటనలు జరిగినట్లు వార్తలొచ్చాయి! ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటకలో ఒక మహిళా అధికారి హత్యకు గురవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

అవును... కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖలో పనిచేస్తున్న ప్రతిమా కెఎస్ (45) బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలోని ఆమె ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఇప్పుడు ఈ విషయం కర్ణాటక రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ప్రతిమా హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అయితే... ఈమె హత్య వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా, మైనింగ్ మాఫియా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు స్పందించారు. ఇందులో భాగంగా... ప్రతిమా హత్యకు గల అసలు కారణం విచారణ తర్వాతే తేలనుందని అంటున్నారు. ఈ సమయంలో ప్రతిమా సహోద్యోగి ఒకరు కన్నడ మీడియాకు ఒక స్టేట్‌ మెంట్ ఇచ్చార్రు. దీంతో... ఈ కేసు సరికొత్త మలుపు తిరిగిందని అంటున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన ఆమె... ప్రతిమా చాలా చురుకైన మహిళ అని, ఆమె కష్టపడి పనిచేయడం వల్లే డిపార్ట్‌మెంట్‌ లో మంచి పేరు తెచ్చుకుందని తెలిపారు. ఇదే సమయంలో ఆమె చాలా ధైర్యవంతురాలని అన్నారు. ప్రధానంగా... అక్రమ గనుల మీద దాడి చెయ్యడానికి, వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఆమె ఇంత వరకు ఏనాడూ వెనుకాడలేదు అని ప్రతిమ కొలీగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో ప్రతిమా చాలా ధైర్యవంతురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారని, ఇటీవల కొన్ని చోట్ల దాడులు నిర్వహించిందని, అయితే ఆమెకు శత్రువులు ఎవరూ లేరని, కొత్త నిబంధనల ప్రకారం ఆమె తన పనిని చక్కగా చేసిందని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి దినేష్ విలేకరులతో అన్నారు. ఇలా కొలీగ్స్ అంతా ఆమె సిన్సియర్ అని, ఇటీవల కొన్ని చోట్ల దాడులు చేశారని చెప్పడంతో... ఆ తర్వాత ఏమి జరిగి ఉంటుందనేది ఆసక్తిగా మారింది!

కాగా... బెంగళూరు సమీపంలోని రామనగర కార్యాలయంలో ఏడాదిపాటుగా ప్రతిమా ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కార్యాలయంలో పని ముగించుకున్న ప్రతిమాను ఆమె డ్రైవర్ బెంగళూరులోని సుబ్రమణ్యపురలోని ఆమె ఇంటి వద్ద రాత్రి 8:30 గంటల సమయంలో దింపాడని అంటున్నారు. ఆ తర్వాత ప్రతిమా హత్యకు గురైనట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో శనివారం రాత్రి ప్రతిమాకు ఆమె సోదరుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదట. దీంతో ఆదివారం ఇంటికి వచ్చి చూడగా ఆమె శవమై కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడని అధికారులు అంటున్నారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్, సాంకేతిక బృందాలు ఆ ప్రాంతంలో పలు ఆధారాలు, సమాచారాన్ని సేకరించారని తెలుస్తుంది.

అయితే ఈ విషయాన్ని కర్నాటక ప్రభుత్వం సీరియస్ గా పరిగణించిందని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ కేసు దర్యాప్తు కోసం పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు. మరి ఎప్పటిలోపు ఈ విషయంపై క్లారిటీ వస్తుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News