నిన్న సుభాష్... నేడు ఖురానా : మగ గుండె ఉసురు పోతోంది !
మగవాడు అన్నది పేరుకు మాత్రమే దర్జా. వ్యవహారం చూస్తే మానసికంగా అత్యంత బలహీనుడు మగాడు.
మగవాడు అన్నది పేరుకు మాత్రమే దర్జా. వ్యవహారం చూస్తే మానసికంగా అత్యంత బలహీనుడు మగాడు. ఎన్నో అధ్యయనాలలో తేలిన నిజం ఇది. శారీరకంగా బలవంతుడు మగాడు. కానీ మనసుకు కష్టం తగిలితే తట్టుకోలేడు. అచ్చంగా దేవదాస్ అయిపోతాడు.
పెగ్గు పుచ్చుకుని మనసుని జో కొడుతూ ఉంటాడు. పైగా మగవాడు కంటే ఆధారపడిన వాడు మరొకడు ఉండడు. ప్రతీ దానికీ ఆడవారి మీద ఆధారపడుతూ బతుకు మొత్తం వెళ్లదీస్తాడు. కాస్తా స్నేహం ఏర్పడి చనువు దొరికితే తన జీవితం మొత్తం భాగస్వామి ముందు పరచేసి ఎద బరువు తగ్గించుకుంటాడు.
తాను నమ్మేసి తనను ఆమె కమ్మేసి అన్నట్లుగా ఉంటాడు. ఆధునిక కాలంలో ప్రేమలు దోమలు అన్నీ కూడా మగవారికి ఎంత మేరకు న్యాయం చేస్తున్నాయన్న రెండవ కోణంలో నుంచి ఇప్పుడు సమాజం చూడాల్సిన సమయం వచ్చిందా అన్న చర్చ వస్తోంది. ప్రేమలు పండి పెళ్ళి పీటల దాకా కధ నడిస్తే అత్యంత సంతోషవంతుడు ఈ ప్రపంచంలో మగవాడే ఈ రోజులలో అన్నది కూడా ఇక్కడ చెప్పుకోవాలి.
బ్రేకప్పుల బాధ లాకప్పుల బాధ కంటే అత్యధికం అని భావించే మగవారి కంటే పిరికి వారు ఎవరు ఉంటారు అన్న ప్రశ్నలూ ఉన్నాయి. పెళ్ళి అయ్యాక ఇల్లే సర్వస్వం అనుకుని తనే నేనుగా అనుకుంటూ కూనిరాగాలు తీస్తే మగవాడు అవతల భాగస్వామి వైపు నుంచి చిన్నపాటి ఇబ్బందిని సైతం తట్టుకోలేని బేలవాడుగా కూడా మారిపోతున్నాడు.
ఆమె ప్రేమను జయించిన రోజున ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంతంగా సంబరపడిన మగవాడే ఆమె కాసింత ఉదాసీనత చూపిస్తే ఏ మాత్రం తట్టుకోలేక పాతాళం అంచులను తాకుతున్నాడు. నిజంగా ఇపుడు మగవాడి బాధ చిత్ర విచిత్రంగా మారుతోంది. భర్తల బాధితులు ఎందరో ఉన్నారు. ఆ కన్నీటి గాధలను సమాజం చూసింది. తానూ సహానుభూతిని వ్యక్తం చేస్తూ వచ్చింది.
మహిళల కోసం వారి సంరక్షణ కోసం ఎనో చట్టాలు వచ్చాయి. కానీ భార్యాబాధితుల విషయంలో ఏమి రక్షణ లభిస్తోంది అన్నది ఇపుడు ఉన్న అత్యాధునిక వ్యవస్థలో నిలువెత్తు ప్రశ్నగా నిలుస్తోంది. భార్యాబాధితులు ఉంటారా వనిత కోమలం కదా మగాడికి ఏమి నిక్షేపంగా గుండ్రాయిగా ఉంటాడని స్త్రీ పక్ష పాతవాదులు అనుకోవచ్చు.
కానీ పీత బాధలు పీతవి అన్నట్లుగా మగవారి బాధలు ఇబ్బందులు వారికి ఎన్నో ఉన్నాయి. అవి ఎవరికీ చెప్పలేక గుట్టి విప్పలేక ఏకంగా గుండెని చిదిమేసుకుని అర్ధాంతరంగా జీవితాలకు సెలవు ప్రకటించేస్తున్నారు. పరుగులు తీసే వయసుని మధ్యలోనే రెడ్ సిగ్నల్ వేసి స్టాప్ చేసేస్తున్నారు.
నిన్నొక సుభాష్ నెడొక పునీత్ దీనిని ఉధారణలుగా ఉన్నారు. కాలం మారింది అంటే ఇదేనేమో. మగవాడు బలవంతుడు అని ఆలోచించే విధానం నుంచి సమాజం కాసింత పక్కకు వచ్చి వేరేగా ఆలోచించాలేమో. రెండవ వైపు కచ్చితంగా చూడాలేమో అనిపించేలా సుభాష్, పునీత్ ల కన్నీటి కధలు ఉన్నాయి.
భార్యల వేధింపులతో తాను తనువు చాలిస్తున్నట్లుగా ఈ మధ్యనే బెంగళూరు కి చెందిన అతుల్ సుభాష్ చెప్పి మరీ ఈ లోకం నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. ఏ సాయం దక్కదని ఏ విధంగా తనకు ఉపకారం లభించదని తీవ్ర నిరాశకు లోను అయి సుభాష్ ఈ విధంగా చేశాడు అనుకుంటే ఇపుడు అదే తన తోవ కూడా అని పునీత్ ఖురానా చెబుతూ బతుకు పోరాటంలో ఓటమిని స్వీకరించాడు.
ఢిల్లీకి చెందిన పునీత్ ఖురానా తనకు ఈ లోకంలో ఏ మాత్రం న్యాయం దక్కదని అలసిపోయి లైఫ్ కే గుడ్ బై కొట్టిన విషాదం ఇది. ఒక వైపు దేశమంతా కొత్త ఏడాదికి ఘన స్వాగతం అంటూ వేడుకలలో ఉంటే ఢిల్లీలోని వుడ్ బాక్స్ కేఫ్ యజమాని అయిన పునీత్ ఖురానా ఆత్మహత్య చేసుకున్నాడు.
తన భార్య మణికా పాహ్వాతో విడాకుల్ కేసు విచారణ దశలో ఉండగానే ఖురానా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాను ఆమె నుంచి విడిపోతున్నా కేఫ్ లో తాను కూడా భాగస్వామినేనని బకాయిలు చెల్లించాలని ఆమె వేధించిందని జరుగుతున్న్న ప్రచారంగా ఉంది.
ఈ మేరకు ఏకంగా 59 నిమిషాల వేధింపుల వీడియో తమ వద్ద ఉందని పునీత్ సోషల్ మీడియా ఖాతాను కూడా హ్యాక్ చేశారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే చట్టాలన్నీ తమకు ప్రతికూలంగా మారుతున్నాయని భార్యా బాధితులు బెంగటిల్లుతున్నారు. తాము ఈ ప్రపంచంలో బతకాలని ఎంతగా పోరాడినా ఫలితం సున్నా అని ముందే గ్రహించి చావుని ఆశ్రయిస్తున్నారు.
చూడబోతే భార్యా బాధితుల జాబితా భారీగా పెరగనుంది అనే అంటున్నారు. మరి ఈ దేశంలో వారి విషయంలో ఏమైనా సానుభూతి దొరుకుందా లేక వారు ఇలాగే ఆత్మహత్యలే శరణ్యం అనుకోవాలా అన్నది ఆలోచించాలి. దాని కంటే ముందు ఆడ అయినా మగ అయినా సమాజంలో పౌరులే. ఎవరికైనా జీవించే హక్కు ఉంది. తప్పు ఏ వైపు నుంచి జరిగింది అన్నది ఆలోచించి న్యాయం చేసే విధంగా మార్పు చేర్పులు ఏమైనా చేసుకోవాలా అన్నది కూడా ఆలోచించాలి. ఈ రోజున ఇదే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ పాయింట్ గా ఉంది అంటున్నారు సామాజిక విశ్లేషకులు.