రూ.300 ఆభరణాలకు రూ.6 కోట్లు.. ఇండియాలో యూఎస్ మహిళకి చేదు అనుభవం
అంతే కాకుండా ఇండియాలోని అమెరికా రాయబారి కార్యాలయంలో కూడా గౌరవ్ పై ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది
రాజస్థాన్ జైపూర్ లోని జోహ్రీ బజార్ లో బంగారు నగల దుకాణం నడుపుతున్న గౌరవ్ పై యూఎస్ కు చెందిన చెరిష్ చీటింగ్ కేసు నమోదు చేసింది. అంతే కాకుండా ఇండియాలోని అమెరికా రాయబారి కార్యాలయంలో కూడా గౌరవ్ పై ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... 2022లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీ తో యూఎస్ కు చెందిన చెరిష్ కు పరిచయం ఏర్పడింది. గత రెండు సంవత్సరాలుగా గౌరవ్ వద్ద దాదాపుగా ఆరు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు కొనుగోలు చేసినట్లుగా చెరిష్ పేర్కొన్నారు.
ఇటీవల అమెరికాలో జరిగిన ఒక ఎగ్జిబిషన్ లో ఆ ఆభరణాలు ప్రదర్శణకు ఉంచగా అవి అన్నీ కూడా నకిలీవి అని, గౌరవ్ తనను మోసం చేశాడు అని తెలిసిందని చెరిష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.
యూఎస్ రాయబార కార్యాలయం లో కూడా చెరీష్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తక్షణమే కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు గౌరవ్ మరియు అతడి తండ్రి కోసం గాలిస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
చెరీష్ చేస్తున్న ఆరోపణ ను మొదట గౌరవ్ కొట్టి పారేశాడు. తాము ఎవరిని మోసం చేయలేదు అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. చివరకు అతడు కనిపించకుండి పోవడంతో వెండి ఆభరణాలకు బంగారు పూత పూసి రూ.300 ఆభరణాలను కోట్ల రూపాయలకు అమ్మినట్లు అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.