'ఆ రోజు' వారిది కాదు.. దానికి ఏడాది గుర్తుగా క్షిపణుల వాన

ఇదంతా ఇజ్రాయెల్ గురించి.. ఆ దేశం హమాస్-హెజ్బొల్లా-ఇరాన్ లపై సాగిస్తున్న యుద్ధం గురించి.

Update: 2024-10-07 15:30 GMT

ప్రపంచంలో టెక్నాలజీ పరంగా అత్యంత శక్తిమంతమైన ఆర్మీ ఉన్న దేశం అది.. శత్రెవు ఎక్కడ ఉన్నా పసిగట్టి హతమార్చే నిఘా వ్యవస్థ ఉన్న దేశం అది.. చుట్టూ ఎప్పుడూ ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. ఎన్నో యుద్ధాల్లో గెలిచిన గొప్పదనం ఆ దేశానిది.. కానీ, ఆ రోజు మాత్రం వారిది కాలేకపోయింది. ఫలితంగా ఏడాది నుంచి రణరంగం సాగుతోంది. ఇదంతా ఇజ్రాయెల్ గురించి.. ఆ దేశం హమాస్-హెజ్బొల్లా-ఇరాన్ లపై సాగిస్తున్న యుద్ధం గురించి.

గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ లోకి గాజా నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచి ఇజ్రాయెల్.. గాజాను లక్ష్యంగా చేసుకుంది. అయితే, హమాస్ పని పడుతున్నవారికి లెబనాన్ నుంచి హెబ్జొల్లాలు పెద్ద తలనొప్పిగా మారారు. ఈ రెండింటికి మద్దతు ఇస్తున్న ఇరాన్ పైనా పోరాటం చేయాల్సిన పరిస్థితి. యుద్ధం మొదలై ఏడాది అయిన సందర్భంగా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత పెంచింది. అయితే, హెజ్‌బొల్లా కూడా క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ లో పలువురు గాయపడ్డారు.

హైఫాపై మెరుపుదాడి

ఇజ్రాయెల్ లోని మూడో అతిపెద్ద నగరం హైఫా. ఇది తీర నగరం. దీనిపై సోమవారం తెల్లవారుజామున.. హెజ్‌బొల్లా ‘ఫాది 1’ క్షిపణులను వింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్‌) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఐదు రాకెట్లు వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. మెయిన్‌ రోడ్డు, రెస్టారెంట్, ఇల్లు దెబ్బతిన్నట్లు వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌ నుంచి ఆదివారం రాత్రి 130 పైగా రాకెట్లు ఇజ్రాయెల్ పైకి వచ్చాయి. వీటిని అడ్డుకున్నట్లు ఐడీఎఫ్‌ చెప్పింది. కాగా, బీరుట్‌ పై ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతూనే ఉంది. ఆదివారం రాత్రి నుంచి 30 పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది.

అది వైఫల్యమే..

గత ఏడాది అక్టోబరు 7న హమాస్‌ దాడిని పసిగట్టడంలో విఫలమైనట్లు ఇజ్రాయెల్‌ సైన్యం అంగీకరించింది. ఆర్మీ చీఫ్‌ హెర్జి హలెవీ సోమవారం ఈ మేరకు ప్రత్యేక సందేశం విడుదల చేశారు. యుద్ధాన్ని సుదీర్ఘమైనది అభివర్ణించారు. సైనిక సామర్థ్యాన్ని.. మానసిక శక్తిని పరీక్షిస్తుందన్నారు. రోజు, వారం, నెల గడిచేకొద్దీ శత్రువుల పరిస్థితి ఘోరంగా మారుతోందని పేర్కొన్నారు. హమాస్‌ సైనిక విభాగాన్ని పూర్తిగా ఓడించామని.. హెజ్‌బొల్లా సీనియర్‌ నాయకత్వాన్ని తుడిచిపెట్టేశామని తెలిపారు.

బందీల్లో మిగిలింది 97 మందే..

నిరుడు దాడి అనంతరం హమాస్ 200 మందిపైగా ఇజ్రాయెలీ, ఇతర దేశాల పౌరులను అపహరించింది. వారిలో కొందరిని విడుదల చేయగా..

97 మంది మాత్రమే బతికి ఉన్నారని తెలిసింది. మరోవైపు గాజాలో 17 వేలమంది హమాస్‌ ఆపరేటివ్‌ లు, ఇజ్రాయెల్‌ లో వెయ్యి మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు ప్రకటించింది. హమాస్ ను నాశనం చేశామని పేర్కొంది. గాజాలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశామని తెలిపింది. 4,700 సొరంగ ప్రవేశమార్గాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ నెల 8 నుంచి లెబనాన్‌ లోని హెజ్‌బొల్లా కూడా తమపై దాడులు మొదలుపెట్టిందని ఇజ్రాయెల్‌ సైన్యం చెప్పింది. ఎదురుదాడుల్లో ఆ సంస్థకు చెందిన 800 మందిని మట్టుబెట్టామని.. వీరిలో 90 మంది టాప్‌ కమాండర్లు ఉన్నట్లు తెలిపింది. 11 వేల హెజ్‌బొల్లా స్థావరాలను పేల్చేశామంది.

Tags:    

Similar News