హైదరాబాద్‌పై చంద్రబాబు కుట్ర: హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను మరోసారి ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అన్నారు. ఇదే జరిగితే.. తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగినట్టేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు కుట్రలకు తెరదీశారని చెప్పారు. దీనిని అందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఇక, కాంగ్రెస్ పార్టీపైనా హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. మాట తప్పారని.. ఇప్పటి వరకు గ్యారెంటీ లను అమలు చేయలేదన్నారు. తమ గ్యారెంటీలను అమలు చేసే ఉద్దేశం కూడా లేదని.. అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఇలాంటి పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక, ఉమ్మడి రాజధాని విషయానికి వస్తే.. 2014 నాటి విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని గా పేర్కొన్నారు. దీనిని పది సంవత్సరాలు కొనసాగిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. అయితే.. ఈ లోగా ఏపీలో రాజధాని నిర్మాణంపూర్తి చేసుకోవాలని కూడా సూచించారు. ఈ క్రమంలోనే 2016-17 మధ్య రాజధాని నిర్మాణానికి ఏపీలో బలమైన పునాదులు పడ్డాయి. కానీ ప్రభుత్వం మారడంతో అక్కడ రాజదాని ఆగిపోయింది. దీంతో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా మార్చాలనే ప్రతిపాదన తొలుత చేసింది వైసీపీనే.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. వైవీ సుబ్బారెడ్డి విశాఖలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను మరో ఐదేళ్లపాటు ఉమ్మడి రాజదానిగా పొడిగించాలనే ప్రతిపాదన ఉందన్నారు. దీనిపై విమర్శలు రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఎదురు దాడి చేశారు. ఇక, చంద్రబాబు కానీ.. ఇతర టీడీపీ కీలక నేతలు కానీ.. ఎక్కడా ఉమ్మడి రాజధానిపై కామెంట్లు చేసినట్టు తెలియదు. కానీ, హరీష్‌రావు..చంద్రబాబుపై ఆరోపణలు చేయడం విశేషం.