చెమటలు తెప్పించే రిపోర్టు: ‘మే’లో మండే ఎండలు.. 50 డిగ్రీలు పక్కానట!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల తర్వాత భానుడు తన భగభగలతో తెలుగు రాష్ట్రాల వారికి చుక్కలు చూపించనున్నారు.

Update: 2024-04-12 05:59 GMT

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 ఏళ్ల తర్వాత భానుడు తన భగభగలతో తెలుగు రాష్ట్రాల వారికి చుక్కలు చూపించనున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో అసాధారణ ఉష్ణోగ్రతలు ఈ ఏడాదిలో ఖాయమని చెబుతున్నారు. ఈసారి వేసవి మరింత హాట్ గా ఉంటుందని కొన్ని నెలల క్రితమే హెచ్చరికలు అందటం తెలిసిందే. అందుకు తగ్గట్లే.. ఫిబ్రవరి మధ్య నుంచే వాతావరణంలో మార్పుల్ని చూస్తున్నాం. తాజాగా భారత వాతావరణ విభాగం వారి అంచనా చూస్తే చెమటలు పట్టాల్సిందే.

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వడగాల్పులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే.. ఈసారి మేలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఖాయమని అంచనా వేస్తున్నారు. గడిచిన ఇరవై ఏళ్లలో ఇంత భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కాలేదంటుననారు. 2003 మే 28న రెంటచింతల గ్రామంలో 49.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. ఈసారి ఆ రికార్డు బద్ధలు కొట్టటం ఖాయమంటున్నారు.

1875లో ఐఎండీ ఏర్పాటైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఏపీలో రికార్డు అయిన అత్యధిక ఉష్ణోగ్రతల్ని గమనిస్తే 2003లో రెంటచింతలలో నమోదైనదే అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 1962లో మే 26న 48.2 డిగ్రీలుగా నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8 డిగ్రీలు.. నంద్యాలలో 1994 మే 11న 48.2 డిగ్రీలు.. మచిలీపట్నంలో 1906లో మే 25న 47.8 డిగ్రీలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ 45 డిగ్రీలను దాటేసిన పరిస్థితి.

మేలో మండే ఎండలు ఉన్నట్లే.. కొన్ని సంవత్సరాల్లో ఏప్రిల్ లోనూ అసాధారణ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో ఏప్రిల్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు తిరుపతిలో నమోదయ్యాయి. ఇక్కడ 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో 46 డిగ్రీలు నమోదు కావటంతో.. పాత రికార్డు చెరిగిపోయింది. ఇదే రోజున నంద్యాల జిల్లా చాగలమర్రి.. నెల్లూరు జిల్లా కనిగిరిలోనూ 45.9 డిగ్రీలు నమోదైన పరిస్థితి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈసారి మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఖాయమంటున్నారు. ఈసారి 50డిగ్రీలను పగటి ఉష్ణోగ్రతలు దాటేయటం ఖాయమని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బీకేర్ ఫుల్.

Tags:    

Similar News