జగన్‌కు ఒంటరిపోరే.. ఇదే రుజువు.. !
జగన్ కి చెప్పకుండా ఏమి చేయలేం అని బాహాటంగానే చెప్పారు. ఇక పార్టీలో కూడా జగన్ ఏం చెబితే అదే నడిచింది.
ఒకప్పుడు జగన్ మాట వేదం. ఒకప్పుడు జగన్ గీత.. లక్ష్మణరేఖ. ఒకప్పుడు జగన్ చెప్పింది చేయాల్సిందే అన్న భావన. ఇది ఇతమిద్ధంగా వైసిపి నాయకులను గాని ఆ పార్టీ వ్యవహారాలను గాని చూస్తే అర్థమవుతుంది. నిజానికి మంత్రులుగా ఉన్నప్పుడు కూడా చాలామంది నాయకులు జగన్ సార్ ఇలా చెప్పారు. లేదా జగనన్న ఇలా చెప్పాడు మేము చేస్తున్నాం. జగన్ కి చెప్పకుండా ఏమి చేయలేం అని బాహాటంగానే చెప్పారు. ఇక పార్టీలో కూడా జగన్ ఏం చెబితే అదే నడిచింది.
ఆయనను ఎదిరించి మాట్లాడేవాళ్లు, ఆయనకు ఎదురు తిరిగి సమాధానం చెప్పిన వాళ్లు కూడా ఎవరూ లేరు. పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తినప్పుడు కూడా ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు కూడా పార్టీ నుంచి బయటికి వచ్చి విమర్శలు చేశారు. తప్ప పార్టీలో ఉండగా ఒక మాట కూడా ఎదురించి మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితి మారిపోయింది. నాయకులు అంతర్గత సంక్షోభంలో చిక్కుకుపోయారు. ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితి వచ్చేసింది.
ఇప్పటికే అనంతపురం జిల్లాకు చెందిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాహాటంగానే జగన్ తీరును తప్పుపడుతున్నారు. ఈ బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఓడిపోయిన కాటసాని బ్రదర్స్ కూడా వైసిపి పై విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసిపి పై జగన్ పట్టు కోల్పోతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఏది జరిగినా పార్టీలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించే కొంతమంది నాయకులు ఇప్పుడు అసలు స్పందించటమే మానేశారు.
ఉదాహరణకు కొడాలి నాని, రోజా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ కూడా సైలెంట్ గా ఉన్నారు. మీరంతా పార్టీని వదిలేస్తారని కాదు. మీరు పార్టీలోనే ఉండొచ్చు. కానీ పార్టీ తరఫున మాట్లాడడానికి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీనికి కారణం జగన్ పై భయం కాదు. పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టే!! అందుకే పార్టీ మీద జగన్ పట్టు కోల్పోయారు అన్న వాదనకు బలం చేకూరింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో వైసిపి పుంజుకోవాలంటే జగన్ ఒంటరి పోరాటం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కేసులు పెడతారో అన్న భయం ఒకవైపు, పార్టీ పరంగా వైసిపి మరింత డైల్యూట్ అయితే తమ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందన్న ఆందోళన ఇంకోవైపు నాయకులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌కు ఒంటరి పోరు తప్పకపోవచ్చు.