నోట్ల కట్టలు, బంగారు గుట్టలు.. హెజ్ బొల్లా సీక్రెట్ బంకర్ వీడియో వైరల్!

ఈ మేరకు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి డెనియల్ హగారీ తన ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడించారు.

Update: 2024-10-22 07:31 GMT

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ ను చంపిన ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగుతామంటూ లెబనాన్ లోని హెజ్ బొల్లా ఇటీవల హచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో... ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్).. ఈసారి హెజ్ బొల్లా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా ఈ మిలిటెంట్ గ్రూపుకు సంబంధించిన ఓ సీక్రెట్ బంకర్ ను గుర్తించినట్లు వెల్లడించింది.

అవును... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అవిరామంగా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్ లోని మిలిటెంట్ గ్రూప్ హెజ్ బొల్లా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఈ సమయంలో వారికి సంబంధించిన ఓ సీక్రెట్ బంకర్ ను గుర్తించినట్లు ప్రకటించింది. ఓ ఆసుపత్రి కింద ఉన్న ఈ రహస్య సొరంగంలో పెద్ద నిధి ఉందని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.

ఈ మేరకు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికార ప్రతినిధి డెనియల్ హగారీ తన ప్రసంగంలో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... హెజ్ బొల్లా ఆర్థిక మూలాలపై వరుసగా దాడులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా జరిపిన దాడుల్లో ఓ బంకర్ ను ధ్వంసం చేయగా.. అందులో లక్షల డాలర్ల నగదు, బంగారాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.

ఈ బంకర్ లో వందల మిలియన్ డాలర్ల నగదుతో పాటు గుట్టలు గుట్టలుగా బంగారం ఉన్నట్లు తెలిసిందని.. అయితే, దానిపై తమింకా దాడి చేయలేదని తెలిపారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం ఆ బంకర్ లో ఉన్న మొత్తం నగదు విలువ సుమారు 500 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.4,200 కోట్లు) అని.. ఇక, గుట్టలు గుట్టలుగా ఉన్న బంగారాన్ని అంచనా వేయాల్సి ఉందని అన్నారు.

ఈ సందర్భంగా ఆ రహస్య బంకర్ కు సంబంధించిన మ్యాప్ ను ప్రదర్శించారు. ఇదే సమయంలో.. తమ యుద్ధం లెబనాన్ పౌరులతో కాదని.. హెజ్ బొల్లతో మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. ఇదే సమయంలో... హెజ్ బొల్లా ఉగ్రకార్యకలాపాలకు అర్థికంగా అండగా ఉండే ప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలు వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని మరోసారి నొక్కి చెప్పారు!

Tags:    

Similar News