భారత మార్కెట్లో హిండెన్ బర్గ్ 'బాంబ్'.. అప్పుడు అదానీ? మరిప్పుడు?

ది అలా ఉండగానే.. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చి మరో పోస్ట్‌ పెట్టింది. శనివారం 'ఎక్స్‌' ఖాతాలో 'సమ్‌ థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా' అని ట్వీటింది.

Update: 2024-08-10 08:43 GMT

సరిగ్గా ఏడాదిన్నర ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది.. బిజినెస్ వ్యవహారాలతో సంబంధం లేనివారికి కూడా సులువుగానే అర్థమైపోయి ఉంటుంది. భారత అపర కుబేరుడిగా చకచకా మెట్లు ఎదుగుతున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంస్థల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్ బర్గ్ అనే సంస్థ బాంబు పేల్చింది. దాని నివేదికలతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయింది. రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అనంతరం కోలుకున్నప్పటికీ.. అదానీపై పడిన మరక అలాగే ఉంది. పైగా ఇప్పటికీ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలన్నీ ప్రధాని మోదీకి అదానీ రహస్య మిత్రుడని ఆరోపిస్తున్నాయి. పడి లేచిన అదానీ మళ్లీ అపర కుబేరుడి రేసులో దూసుకెళ్తుండగా.. హిండెన్ బర్గ్ సంస్థ మరోసారి బాంబు పేల్చేందుకు సిద్ధం అవుతోంది.

సమ్ థింగ్ బిగ్ సూన్ అంటూ..

హిండెన్ బర్గ్ అనేది అమెరికా షార్ట్‌ సెల్లర్‌. గత ఏదాది దాని నివేదిక అదానీ సామ్రాజ్యాన్నే కాక దేశ వ్యాపార రంగాన్నీ కుదిపేసిది. ఆ వివాదం ఇంకా సద్దుమణగనే లేదు. అది అలా ఉండగానే.. హిండెన్‌ బర్గ్‌ రీసెర్చి మరో పోస్ట్‌ పెట్టింది. శనివారం 'ఎక్స్‌' ఖాతాలో 'సమ్‌ థింగ్‌ బిగ్‌ సూన్‌ ఇండియా' అని ట్వీటింది. ఇది భారత మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా? అనే సందేహాలకు తావిచ్చింది. దీనికితగ్గట్లే నెట్టింట్లో కలకలం మొదలైంది. ఈసారి హిండెన్ బర్గ్ ఏ కంపెనీని లక్ష్యంగా చేసుకుందో అనే చర్చ జరుగుతోంది.

సోమవారం స్టాక్ మార్కెట్లను పడేస్తుందా?

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నప్పటికీ.. భారత మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. అలాంటప్పుడు హిండెన్‌ బర్గ్‌ నివేదిక ఏం చేస్తుందోననే భయాలు నెలకొన్నాయి. కాగా, శని, ఆదివారాలు మార్కెట్లకు సెలవు. దీంతో హిండెన్ బర్గ్ నివేదిక సోమవారం నాటి ట్రేడింగ్‌ పై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందంటున్నారు. కాగా, భారత ఎకానమీని దెబ్బకొట్టే ఉద్దేశంతోనే హిండెన్‌ బర్గ్‌ ఇలా చేస్తోందని కొందరు మండిపడుతున్నారు.

2023 జనవరిలో ఏం జరిగింది...?

లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందంటూ అదానీ గ్రూప్ పై 2023 జనవరి 23న హిండెన్‌ బర్గ్‌ నివేదిక ఇచ్చింది. అంతేగాక.. ఈ షేర్లను కుదువ పెట్టి రుణాలు పొందిందని ఆరోపించింది. ఇది ఖాతా మోసం అని పేర్కొంది. మరోవైపు ట్యాక్స్ ఫ్రీ దేశాలైన కరీబియన్‌, మారిషస్‌ నుంచి యూఏఈల్లో అదానీ కుటుంబం డొల్ల కంపెనీలను కంట్రోల్ చేస్తోందని బండ వేసింది. ఇది అవినీతి, అక్రమ నగదు బదలాయింపులకు మార్గంగా చూపడంతో అదానీ గ్రూప్‌ షేర్లు ఎవరూ ఊహించనంత దారుణంగా పతనమయ్యాయి. సహజంగానే అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించి.. ఇన్వెస్టర్లు, రుణదాతల్లో విశ్వాసం నింపే చర్యలు చేపట్టింది. షేర్లు గాడినపడ్డాయి. హిండెన్ బర్గ్ నివేదికపై సెబీ కూడా దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు వెల్లడించింది. అదానీ గ్రూప్ వ్యవహారాలను హిండెన్‌బర్గ్‌ ముందే తమ క్లయింట్లతో పంచుకుందని ఆరోపించింది. నివేదిక తర్వాత ఆయా క్లయింట్లు షార్ట్‌ పొజిషన్ల ద్వారా ఆర్జించిన లాభాల్లో వాటా తీసుకుందని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెనక చైనా హస్తం ఉందన్న ఆరోపణలూ వినిపించాయి.

Tags:    

Similar News