కూటమికి తిరుపతి సీటు ఎలా చేజారింది?

అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. కూటమి చేసిన తప్పుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో వైసీపీ విజయం సాధించింది.

Update: 2024-06-06 04:21 GMT

ఒక లోక్ సభా నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు అన్నింటిలోనూ పార్టీ ఓడిపోయి.. అందుకు భిన్నంగా ఎంపీ స్థానాన్ని సొంతం చేసుకోవటం అంతసామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో వైసీపీ ఒక ఆశ్చర్యకర ఫలితాల్ని నమోదు చేసిందని చెప్పాలి. తిరుపతి ఎంపీ ఎన్నిక విషయంలో ఇదే మేజిక్ చోటు చేసుకుంది. ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు అన్నింటిని సొంతం చేసుకోవటమే కాదు.. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ కూటమికి తిరుపతి ఎంపీ స్థానం చేజారటం నిరాశకు గురి చేసింది. ఇంతకు తిరుపతి ఎంపీ స్థానాన్ని వైసీపీ ఎలా సొంతం చేసుకుంది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. కూటమి చేసిన తప్పుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటంలో వైసీపీ విజయం సాధించింది. అదే తిరుపతిసీటును సొంతం చేసుకునేలా చేసింది.

తిరుపతి లోక్ సభా స్థానం పరిధిలో తిరుపతి, చంద్రగిరి. శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది. మంచి మెజార్టీలను సొంతం చేసుకున్నారు. ఈ లెక్కన చూసినప్పుడు ఎంపీ స్థానానికి బరిలో ఉన్న కూటమి అభ్యర్థి ఆడుతూ పాడుతూ విజయం సాధించాలి. అందుకు భిన్నంగా తిరుపతి ఎంపీగా వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి గెలవటం ఆసక్తికరంగా మారింది. ఈ విజయానికి కారణం భారీగా జరిగిన క్రాస్ ఓటింగ్ గా చెబుతున్నారు.

గెలుపు వైసీపీ సొంతమైనా.. వచ్చిన మెజార్టీ చూస్తే విషయం అర్థమవుతుంది. బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న వరప్రసాద్ మీద వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి 14,569 ఓట్లతో విజయం సాధించారు. తిరుపతి ఎంపీ స్థానాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా వరప్రసాద్ ను బరిలోకి దించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇదే వరప్రసాద్ 2014లో వైసీపీ అభ్యర్థిగా తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

అయితే.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు జగన్ నో చెప్పటంతో ఆయన వెంటనే పార్టీ మారారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసిన ఆయన.. ఆ తర్వాత బీజేపీలోకి చేరటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనకే తిరుపతి బీజేపీ ఎంపీగా అవకాశం ఇవ్వటంతో బరిలోకి దిగారు. తిరుపతి ఎంపీ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఆలస్యంగా సీన్లోకి రావటం ఒక ఎత్తు అయితే.. గెలుపు ధీమాతో ప్రదర్శించిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు.. మోడీ మీద ఉన్న వ్యతిరేకత కూడా వరప్రసాద్ ఓటమికి కారణంగా చెప్పాలి. ఒకవేళ.. ఇదే వరప్రసాద్ తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన తరఫు కానీ బరిలోకి దిగి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదంటున్నారు.

తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి సైతం అనూహ్యంగా రాజకీయాల్లోకి రావటం తెలిసిందే. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యం కారణంగా మరణించటంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో గురుమూర్తిని తెర మీదకు తీసుకొచ్చిన వైసీపీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై ఘన విజయాన్ని సాధించారు. తాజాగా మరోసారి ఎన్నికల్లో గెలవటం ద్వారా.. రెండోసారి ఎంపీగా లోక్ సభలోకి అడుగుపెట్టనున్నారు. తన పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఓడినప్పటికి.. తాను మాత్రం ఎంపీగా విజయం సాధించటంతో ఈ గెలుపు ఇస్పెషల్ అన్న మాట ఆయన సన్నిహితుల నోటి నుంచి వినిపిస్తోంది.

Tags:    

Similar News