హిమాలయాలు ప్రకోపిస్తే కల్లోలమేనా ?

మంచుతో మంచిగా ఉండే ఈ కొండలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ప్రభోదిస్తూంటాయి.

Update: 2025-01-08 04:16 GMT

హిమగిరి సొగసులు మురిపించునూ మనసులు అని కవులు పాడుకుంటారు. నిజమే ఎత్తైన హిమాలయాలు ఎంతో మానసిక ఆనందాన్ని ప్రకృతి ప్రేమికులకు ఇస్తాయి. ఆధ్యాత్మిక పరులకు అక్కడ ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. యోగులు అంతా అక్కడే ఉంటారు. మంచుతో మంచిగా ఉండే ఈ కొండలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ప్రభోదిస్తూంటాయి.

అయితే ప్రకృతిలో అన్నీ కూడా భాగమే. ఎపుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇక అందమైన హిమాలయాలు ప్రకోపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా మంగళవారం టిబెట్ నేపాల్ పరిసరాలలో సంభవించిన తీవ్ర భూకంపానికి 130 మంది దాకా మరణించారు. వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు.

ఈ పెను ప్రకృతి విపత్తుతో భారీ నష్టం సంభవించింది. ఏకంగా గంటల వ్యవధిలో ఆరేడు సార్లు భూమి కంపించింది అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే హిమాలయాల్లో భూకంపం వచ్చిందని దాని ప్రభావమే నేపాల్ టిబెట్ సరిహద్దులలో కనిపించిందని అంటున్నారు.' 7.1 మాగ్నిట్యూడ్ తో భారీ భూకంపం రావడం వల్ల నేపాల్ టిబెట్ నే కాదు ఉత్తర భారత దేశం అంతా వణికిపోయింది.

ఇక టిబెట్ రాజధాని లాసాకు నైరుతి దిశలో 400 కిలోమీటర్ల దూరంలో టింగ్రీ కౌంటీలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. ఇక హిమాలయాలల్లో రానున్న కాలంలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు హిమాలయాలల ప్రాంతంలో భూకంపాలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

రానున్న కాలంలో 8 నుంచి ఎక్కువ స్థాయిలోనే మాగ్నిట్యూడ్ తీవ్రతతో భారీ భూకంపాలు హిమాలయాల్లో సంభవించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిమాలయాల ప్రాంతంలో ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ ఆసియా టెక్టోనిక్ ప్లేట్ ని ముందుకు నెడుతోంది అని అంటున్నారు. ఇలా భూ అంతర భాగంలో జరిగే భారీ సంఘర్షణల వల్లనే భూకంపాలు వస్తున్నాయని అంటున్నారు.

ఇక హిమాలయాల చరిత్ర చూస్తే అవి వేల కోట్ల ఏళ్ళ క్రితం ఇలాంటి భూకంపాల వల్లనే ఉద్భవించాయని చెబుతున్నారు. ఇక ప్రతీ ఏటా ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ కొన్ని మిల్లీమీటర్ల మేర ఉత్తర దిశగా ముందుకు నెడుతోందని దాని ఫలితంగా హిమాలయాల ఎత్తు కూడా నెమ్మదిగా పెరుగుతోంది అని అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు హిమాలయాలలో ఏదో ఒక రోజు భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అది రేపు అయినా కావచ్చు లేదా పదేళ్ళు వందేళ్ళ కాలమైనా పట్టవచ్చు కానీ భూకంపాలు మాత్రం హిమాలయాల నుంచి వచ్చే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే ఉత్తరాదిన ఉన్న ప్రాంతాలకు చాలా ఇబ్బంది అవుతుందని కూడా అంటున్నారు.

దీనికి గతంలో జరిగిన సంఘటనలు ఉదహరిస్తున్నారు. 1897లో షిల్లాంగులో అలాగే 1905లో కాంగ్రాలో, 1934లో నేపాల్ బీహార్ లలో, 1950లో అసోంలో భారీ భూకంపాలు సంభవించాయని గుర్తు చేస్తున్నారు. ఇక 1991లో ఉత్తర కాశీలో భూకంపం సంభవించిందని అలాగే 1999లో చమోలీలో 2015లో నేపాల్ లో భూకంపాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు.

వీటి వల్ల వేలాది మంది మరణించారని చెబుతున్నారు. మంచుతో నిండిన ఈ అత్యున్నత శిఖరం పైకి గంభీరంగా ఉన్నా లోపల జరిగే సంఘర్షణల ఫలితంగా భూకంపాలు విరుచుకుపడతాయని ప్రకృతి విపత్తు నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News