హైదరాబాద్ పోలీసులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీకెండ్

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు బస చేసిన హోటల్ పై దాడికి (ఇప్పటికే పోలీసులు దాన్ని సీజ్ చేశారు) ప్రయత్నించారు.

Update: 2024-10-20 08:05 GMT

అవును.. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత సీరియస్ వీకెండ్ గా ఈ శనివారం నడించింది. హైదరాబాద్ మహానగర పోలీసుల పరిస్థితి దారుణంగా మారింది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ లో గడిచిపోయింది. ఎప్పుడూ లేనివిధంగా ఒకే రోజు.. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో వీఐపీ మూమెంట్ భారీగా ఉండటం.. అన్ని కార్యక్రమాలు చాలా సున్నితంగా ఉండటంతో పోలీసులంతా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని పాతబస్తీలోని చార్మినార్ వద్ద సద్బావన యాత్రను చేపట్టారు.మరో కార్యక్రమంలోనూ హాజరయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ నాగోల్ వద్ద ఎస్టీపీని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

ఇది సరిపోదన్నట్లుగా సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ టెంపుల్ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉదంతానికి సంబంధించిన ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్ బంద్ ను చేపట్టారు. వ్యాపారస్తులు.. వ్యాపారసంస్థలతో పాటు.. అన్ని వాణిజ్య కార్యకలాపాలు స్వచ్చందంగా ఆపేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. శనివారం మధ్యాహ్నం వేళకు నిరసన ప్రదర్శన పేరుతో చేపట్టిన ర్యాలీ ఆద్యంతం ఉద్రిక్తంగా మారింది. తొలుత వెయ్యి మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొంటారని భావిస్తే.. చూస్తుండగానే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హిందూ సంఘాలకు చెందిన వారు వందలాదిగా రావటంతో.. వేలాదిగా మారిన పరిస్థితి.

అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు బస చేసిన హోటల్ పై దాడికి (ఇప్పటికే పోలీసులు దాన్ని సీజ్ చేశారు) ప్రయత్నించారు. దీన్ని అడ్డుకునేందుకు పోలీసులు చెమటలు చిందించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిరసనకారులపై లాఠీలను ఝుళిపించాల్సి వచ్చింది. అది కూడా ఒక్కసారి కాదు రెండుసార్లు. పోలీసుల లాఠీ దెబ్బలకు దాదాపు నలుగురైదురికి తలలు పగిలినట్లుగా చెబుతున్నారు. పలువురికి గాయాలు అయ్యాయి.

దీంతో.. పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. నిజానికి పోలీసులు చాలా సున్నితంగా వ్యవహరించి.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చేసేందుకు చాలానే ప్రయత్నించినప్పటికీ.. ఒక దశ దాటిన తర్వాత నిరసనకారుల్ని కంట్రోల్ చేసేందుకు లాఠీలు తీయక తప్పలేదు. ఒకవేళ.. తీయకుంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమయ్యేదన్న మాట వినిపిస్తోంది. చూస్తుండగానే పరిస్థితులు మారిపోవటంతో.. ఈ ఘటనకు చుట్టుపక్కల ఉన్న దాదాపు ఫది - 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ల నుంచి అదనపు బలగాల్ని యుద్ధ ప్రాతిపదికన తరలించారు. లా అండ్ ఆర్డర్ ను మొయింటైన్ చేసేందుకు కిందామీదా పడాల్సి వచ్చింది.

ఈ రచ్చ ఇలా ఉంటే.. మరోవైపు గ్రూపు1 అభ్యర్థుల ఆందోళనకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఆందోళన చేస్తున్న అభ్యర్థులను కలిసి.. వారి వాదనల్ని విన్నారు. చివర్లో ఆయన అప్పటికప్పుడు ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని షురూ చేశారు. దీంతో.. వందలాది మంది విద్యార్థుల్ని కంట్రోల్ చేయలేక.. అదే సమయంలో అక్కడ ఉన్నది కేంద్ర మంత్రి కావటంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఒక దశ దాటిన తర్వాత పరిస్థితిని మార్చేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చివరకు ఆయన్ను పార్టీ ఆఫీసు వద్ద దించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు షేక్ పేట.. కార్వాన్ నియోజకవర్గాల పరిధిలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఆయన కార్యక్రమం మాత్రం ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా సాగింది.

ఈ కార్యక్రమాలు సరిపోనట్లుగా హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మంత్రి పొంగులేటి డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఇళ్ల పత్రాల్ని అందించటంతో పాటు.. మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరంలో ఓవైపు ఇదంతా జరుగుతుంటే.. మరోవైపు శుక్రవారం కలకలం రేపిన మియాపూర్ మెట్రో స్టేషన్ కు సమీపంలో చిరుతపులి కనిపించిందన్న నేపథ్యంలో.. దాని లెక్క తేల్చేందుకు పోలీసులు.. అటవీ అధికారులు కిందా మీదా పడ్డారు. చివరకు దాని కాలి ముద్రల్ని గుర్తించి..అది చిరుతపులి కాదని అడవి పిల్లిగా తేల్చారు.

ఇలా ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నగరంలో ఏ నిమిషాన ఏం జరుగుతుందో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. చివర్లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ఒక కారులో ఉన్నట్లుండి పొగలు.. ఆపై మంటలు రేగటంతో డ్రైవర్ వెంటనే కారు ఆపి బయటకు వచ్చేశారు. చూస్తుండగానే కళ్ల ముందు కారు తగలబడిపోయింది. దీంతో.. మియాపూర్ - కేపీహెచ్ బీ రోడ్ మొత్తం ట్రాఫిక్ బ్లాక్ అయ్యింది. వీకెండ్ కావటం.. అందునా సాయంత్ర వేళ కావటంతో మూడునాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ తో వేలాది మందికి చుక్కలు కనిపించిన పరిస్థితి. ఇలా శనివారం మొత్తం పోలీసులు కుదురుగా కూర్చోకుండా పరుగులు పెడుతూనే ఉండాల్సిన పరిస్థితి.

Tags:    

Similar News