హైదరాబాద్‌ లో మరో భారీ ఉగ్ర కుట్ర భగ్నం!

ఇక తెలంగాణ లోని హైదరాబాద్‌ , సైబరాబాద్‌ పరిధిలో 5 చోట్ల సోదాలు నిర్వహించారు.

Update: 2023-09-16 11:36 GMT

దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలకు తెరలేస్తున్న వేళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు మరో భారీ కుట్రను భగ్నం చేశారు. తాజాగా హైదరాబాద్‌ తోపాటు తమిళనాడులోనూ ఎన్‌ఐఏ అధికారులు 31 చోట్ల సోదాలు జరిపారు. ఐసిస్‌ ఉగ్రవాదులు, సానుభూతిపరుల కోసం విస్తృత తనిఖీలు చేశారు. తెలంగాణ, తమిళనాడుల్లో దాడులు చేపట్టి పలువురిని తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో కీలక పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, లాప్‌ టాప్‌ లు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. రూ.60 లక్షల భారత కరెన్సీతో పాటు 18,200 అమెరికన్‌ డాలర్లను సీజ్‌ చేశారు.

తమిళనాడులో చెన్నై తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూర్‌ లోని 22 చోట్ల, రాజధాని చెన్నైలోని 3 చోట్ల, తమిళనాడులోని తెన్‌ కాసి జిల్లాలోని కడైయనల్లూర్‌ లో ఒక చోట ఎన్‌ఐఏ అధికారులు విస్తృత తనిఖీలకు దిగారు.

ఇక తెలంగాణ లోని హైదరాబాద్‌ , సైబరాబాద్‌ పరిధిలో 5 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మహ్మద్‌ హసన్‌ అజహర్‌ సిద్దికీ, సయ్యద్‌ మురాబాతుద్దీన్, ఖాజా తమీజుద్దీన్, మహ్మద్‌ నూరుల్లా హుస్సేన్, సయ్యద్‌ అబ్దుల్‌ జబ్బార్‌ లను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మదర్సాలు అరబిక్‌ క్లాసుల పేరుతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నాయని ఎన్‌ఏఐ అధికారులు అనుమానిస్తున్నారు. రీజనల్‌ స్టడీ సెంటర్ల పేరుతో కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని చెబుతున్నారు. సోషల్‌ మీడియా, వాట్సప్, టెలిగ్రామ్‌ ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు ఇచ్చి యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు,

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అస్థిరపరిచే కుట్రతో కిలాఫత్‌ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదుల కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు తమ సంస్థలోకి చేర్చుకుంటున్నారని సమాచారం.

గతేడాది అక్టోబర్‌ 23న కోయంబత్తూర్‌ లో ఉగ్రవాదులు కారు బాంబును పేల్చిన సంగతి తెలిసిందే. ఇలా ప్రత్యేక శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఈ పనిచేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్‌ ను, తమిళనాడును ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నారని ఇంటెలిజెన్స్‌ హెచ్చరించడంతో తాజా సోదాలు నిర్వహించారని తెలుస్తోంది.

Tags:    

Similar News