మోడీ క్యాబినెట్ లో ఆ దిగ్గజ నేతలు కనిపించరా ?
అంతే కాదు ఆ బిగ్ నంబర్స్ కనుక జూన్ 4న పోలింగ్ లో కూడా వస్తే మోడీ రాజకీయ బాహుబలిగా మారుతారు అని కూడా అంటున్నారు.
దేశంలో అత్యంత బలవంతుడైన రాజకీయ నేతగా ప్రస్తుతం మోడీ ఉన్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే కచ్చితంగా మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అంతే కాదు ఆ బిగ్ నంబర్స్ కనుక జూన్ 4న పోలింగ్ లో కూడా వస్తే మోడీ రాజకీయ బాహుబలిగా మారుతారు అని కూడా అంటున్నారు.
మోడీ ఆ విధంగా కనుక పూర్తి బలంతో మూడవసారి దేశ ప్రధాని అయితే ఆయనకు బీజేపీ పార్టీ లోపలా బయటా కూడా ఎవరూ కాదనలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మోడీ అంటేనే వ్యూహకర్త. పైగా ఆయన రానున్న కాలాన్ని కూడా ఆలోచించి దానికి తగిన ఎత్తుగడలు వేస్తారు అని చెబుతారు.
మోడీ తొలిసారి ప్రధాని కాగానే 75 ఏళ్ల ఏజ్ సీలింగ్ ని పెట్టి పెద్ద తలకాయలను అందరినీ వెనక్కి నెట్టేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత మరి కొందరిని క్రియా శీల రాజకీయాల నుంచి పక్కన పెట్టి కొందరికి వేరే పదవులు ఇచ్చి మొత్తానికి ఇంటికే పరిమితం చేశారు అని చెబుతారు.
ఈ నేపధ్యంలో బీజేపీలో మోడీ టార్గెట్ లీడర్స్ ఇంకా కొందరు ఉన్నారని ప్రచారం అయితే ఉంది. వారిలో ముందు వరసలోని వచ్చే వారు నితిన్ గడ్కరీ అని అంటారు. ఆయనకు మోడీ మొదటి క్యాబినెట్ లో ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కినా ఆ తరువాత 2019లో మాత్రం రహదారులు ఉపరితల రవాణా శాఖ మాత్రమే దక్కింది.
దానికి కారణం ఆయన మోడీ కంటే జాతీయ రాజకీయాల్లో సీనియర్. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన వారు. ఆరెస్సెస్ మద్దతు ఉన్న నేత. ప్రధాని పదవికి గట్టి పోటీదారు. ఎప్పటికైనా బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే మోడీకి ఆల్టర్నేషన్ గా ఉన్న నేత ఆయన అని చెబుతారు.
ఇక మోడీ సెకండ్ టెన్యూర్ లో ఆయన ఇండైరెక్ట్ గా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అని చెబుతారు. ఒక్కోసారి అవి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయని అంటారు. దాంతో మోడీ అనుకున్నట్లుగా బీజేపీకి 370 సీట్లు సొంతంగా రాకపోయినా 325 సీట్లు వచ్చినా కూడా ఆయన కొత్త క్యాబినెట్ లో నితిన్ గడ్కరీకి చాన్స్ ఉండకపోవచ్చు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్న వారు రాజ్ నాధ్ సింగ్. ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నపుడే మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. అంతే కాదు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినది కూడా రాజ్ నాధ్ సింగే. ఆయన మోడీ ఫస్ట్ టెర్మ్ లో కీలకమైన హోం శాఖను నిర్వహించారు. రెండవసారి మాత్రం రక్షణ శాఖ ఇచ్చారు.
ఈసారి మోడీ ప్రభుత్వం వస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది ఒక డౌట్ అని చెబుతున్నారు. ఎందుకు అంటే ఆయన సీనియారిటీ. ఆయన యూపీకి చెందిన నేపధ్యం వంటివి ప్రధాని రేసులో పోటీకి దారి తీయవచ్చు అన్నది అని అంటున్నారు.
ఇక మూడవ వారు యోగీ ఆదిత్యనాధ్. ఆయన రెండవసారి యూపీ సీఎం గా గెలిచారు. ఆయన చాలా సమర్ధవంతంగా పాలన చేస్తున్నారు. ఆయనకు ఆరెస్సెస్ సపోర్ట్ ఉంది. ఎప్పటికైనా ఆయన ప్రధాని రేసులోకి వస్తారు అన్న చర్చ కూడా ఉంది. దాంతో ఆయనను సీఎం పదవి నుంచి తప్పిస్తారు అన్న ప్రచారమూ ఉంది.
ఇదే విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల సభలలో ప్రచారం చేశారు. మోడీ మళ్లీ గెలిస్తే యోగీ మాజీ సీఎం అవుతారు అని ఆయన చెప్పారు కూడా. ఇవన్నీ ఇపుడు ప్రచారంలో ఉన్న విషయాలు. బీజేపీలో చూస్తే మోడీ అమిత్ షాలదే ఆధిపత్యం అన్నట్లుగా ఉంది అని అంటారు.
మోడీ తరువాత అమిత్ షాను ప్రధాని చేస్తారు అని ఆప్ అధినేత కేజ్రీవాల్ చెప్పినదీ గుర్తు చేసుకుంటున్నారు. అలా ఈ ఇద్దరు అగ్ర నేతలూ హ్యాట్రిక్ ప్రభుత్వంలో పార్టీ లోపల కూడా పూర్తి ప్రక్షాళన చేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం పుకారుగా ఉండిపోతుందా నిజం అవుతుందా అన్నది.