అర్జెంట్ గా ఐఐటీ బాంబేను ఫాలో కావాలి తెలుగు రాష్ట్రాలు

తాజాగా ఐఐటీ బాంబే జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు

Update: 2023-08-01 06:17 GMT

పరిచయమైన పది నిమిషాలకే.. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో పట్టించుకోకుండా మీది తెనాలేనా? అంటూ ముఖానే అడిగేయటం ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అలవాటు. గతంలో లేని ఈ అలవాటు ఇప్పుడు తెలంగాణలోనూ నెమ్మదిగా షురూ అయ్యింది. గతంలో పరిచయానికి మీరెవరు? మీరు ఏమిట్లు (కులం ఏది?) అన్న క్వశ్చన్ తెలంగాణలోనే కాదు.. ఉత్తరాంధ్ర.. రాయలసీమలోనూ తక్కువే. అయితే.. మారిన పరిస్థితుల పుణ్యమా అని ఈ కుల జాఢ్యం అంతకంతకూ ముదిరిపోతోంది.

మిగిలిన చోట్ల కంటే విద్యా సంస్థల్లో ఈ తీరు ఎక్కువగా ఉంది. కొత్తగా విద్యాసంస్థలో అడుగు పెట్టినంతనే.. ఎవరితోనైనా మాట కలిపిన కాసేపటికే మీరు ఏ కులపోళ్లు అంటూ ముతగ్గా కాకుండా.. మీది తెనాలేనా? అనో.. మేం ఫలానా? మీరేంటి? అంటూ అడిగేయటం పెరిగింది. ఇలాంటి వాటి విషయంలో ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ బాంబే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తోటి విద్యార్థుల కులగోత్రాలు.. వారు సాధించిన స్కోర్ గురించి ఆరా తీయకూడదన్న రూల్ పెట్టేసింది.

తాజాగా ఐఐటీ బాంబే జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులం.. స్కోర్ లాంటి వాటి కంటే ఆటల గురించి.. సినిమాలు.. సంగీతానికి సంబంధించిన ఆసక్తుల గురించి మాట్లాడుకోవాలన్న సూచన చేసింది. ఫిబ్రవరి 12న బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివే దర్శన్ సోలంకి అనే విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి కారణం.. ఐఐటీ బాంబేలో కుల వివక్ష ఉందని.. తన కులం గురించి తెలియగానే తోటి విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వచ్చినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. పోలీసులకు క్యాంప్ లో కులవివక్ష గురించి ఆమె చెప్పారు. తన కొడుకు ఫోన్ చేసినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడేవారని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తోటి విద్యార్థుల కులం గురించి.. వారు సాధించిన జేఈఈ.. గేట్ ర్యాంకుల గురించి ఆరా తీయకూడదన్న మార్గదర్శకాల్ని జారీ చేసింది. స్కోర్ ఆధారంగా కూడా కులాన్ని అంచనా వేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని విద్యాసంస్థల్లో తక్షణమే అమలు చేస్తే బాగుంటుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News