బహిష్కరణ నుంచి తప్పించుకోవడం ఎలా?... అమెరికాలో మహిళ నేత షాకింగ్ వీడియో!

ఇప్పుడు అమెరికా నుంచి బహిష్కరణకు గురవుతున్న అక్రమ వలసదారులకు సంబంధించిన విషయాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2025-02-06 17:01 GMT

ఇప్పుడు అమెరికా నుంచి బహిష్కరణకు గురవుతున్న అక్రమ వలసదారులకు సంబంధించిన విషయాలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. 104 మంది భారతీయులను అమెరికా ఇండియాకు పంపింది. ఈ సమయంలో బహిష్కరణ నుంచి తప్పించుకోవడంపై అమెరికా కాంగ్రెస్ మహిళ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును... అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అమెరికా కాంగ్రెస్ మహిళ ఇల్హాన్ ఒమర్.. అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న సోమాలీ వలసదారులు బహిష్కరణకు గురవ్వకుండా ఉండటానికి చిట్కాలను అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట దర్శనమివ్వడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... ఇమ్మిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) అధికారుల ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఆమె అక్రమ వలసదారులతో ఓ సెమినార్ నిర్వహించినట్లు చెబుతున్నారు. ఆ సెమినార్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా.. ఒక అమెరికన్ పౌరురాలిగా, కాంగ్రెస్ మహిళగా చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆమెపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఐసీఈ అధికారులు మిమ్మల్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే.. మీరు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ఈ సమయంలో ఓ న్యాయవాది సమాధానం చెప్పవద్దని తమకు చెప్పారని చెప్పండని.. మీరు మీ పేరు, ఇమ్మిగ్రేషన్ స్థితి మొదలైన విషయాలు వారితో పంచుకోవాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నట్లు ఉన్న వీడియో ఇప్పుడు.. సంచలనంగా మారింది.

ఈ సందర్భంగా నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా.. ఒక కాంగ్రెస్ మహిళగా ఉండి.. ఇమ్మిగ్రేషన్ అధికారులనుంచి ఎలా తప్పించుకోవాలో అక్రమ వలసదారులకు చిట్కాలు ఇవ్వకూడదని కొంతమంది చెబుతున్నారు. మరోపక్క.. ఆమె వలసదారులకు చట్ట ప్రకారం వారి హక్కులపై అవగాహన కల్పిస్తోందని, అందులో తప్పేమీ లేదని ఆమె మద్దతుదారులు వాదిస్తున్నారు.

కాగా... మెన్నెసోటాలోని 5వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి అయిన ఒమర్.. అమెరికాలో నమోదుకాని వలసదారుల కోసం చాలా కాలంగా గొంతు విప్పారని చెబుతారు. ఈ సమయంలో... అనేకమంది అక్రమ వలసదారులు సమాజానికి తమ వంతు కృషి చేయాలని.. వారు చట్టపరమైన హోదా పొందడానికి ఒక మార్గం ఉండాలని పేర్కొంటూ ఆమె యూఎస్ ఇమ్మిగ్రేషన్ విధానంలో సంస్కరణల కోసం కూడా వాదించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News