దేశం 'కేంద్రీ కృతం' అవుతోందా? మేధావుల టాక్ ఇదే!

తాజాగా తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వంటివారు.. కేంద్రంపై నిప్పులు చెరిగారు.

Update: 2025-02-17 22:30 GMT

దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. వీటికి తోడు మ‌రో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. 28 రాష్ట్రాల ప‌రిస్థితి మాత్రం డోలాయ‌మానంగా మారుతోంద‌న్న‌ది కొన్నాళ్లుగా ఉన్న చ‌ర్చే! కేంద్రాన్ని కాక‌ప‌డితేనో.. లేక కేంద్రంలోని బీజేపీతో చేతులు క‌లిపితేనో.. ఆయా రాష్ట్రాలకు మ‌నుగ‌డ క‌ష్టంగా మారింద‌న్న‌ది కూడా.. కొన్నాళ్లుగా వినిపి స్తున్న మాట‌. గ‌తంలో ఇందిరాగాంధీ కూడా.. ఇలానే చేసేవార‌న్న అప‌ప్ర‌ద‌ను మూట‌గ‌ట్టుకున్నారు. ఆమెకు దోసిలొగ్గినరాష్ట్రాల విష‌యంలోనే క‌రుణించార‌న్న మాట ఇందిర పాల‌న‌లో త‌ర‌చుగా వినిపించేది.

క‌ట్ చేస్తే.. యూపీఏ హ‌యాంలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రాల‌పై ఆధిప‌త్యం.. అధికారం కొన‌సాగ‌లేద‌న్న‌ది మేధావులు చెబుతున్న మాట‌. కానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని రాష్ట్రాల పాల‌కులు కూడా చెబుతున్నారు. తాజాగా తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వంటివారు.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాల అధికారాల‌ను లాగేసుకుంటున్నార‌ని, క‌నీసం.. ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చే ప‌రిస్థితి కూడా లేకుండా చేస్తున్నార‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. బ‌లవంతంగా రాష్ట్రాల‌పై కేంద్రం స్వారీ చేస్తోంద‌ని కూడా దుయ్య‌బ‌ట్టారు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో మేధావులు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కేంద్రీకృత మ‌వుతున్న రాష్ట్రాల అధికారాల‌ను వారు ప్ర‌స్తావిస్తూ.. ప‌లు ఉదాహ‌ర‌ణ‌లు పేర్కొన్నారు. నాలుగేళ్ల కింద‌టి వ‌రకు.. విద్య‌, ఉపాధి, రైతులు, శాంతి భ‌ద్ర‌త‌లు, భూముల హ‌క్కులు, రేష‌న్ పంపిణీ వంటి కీల‌క అంశాలు రాష్ట్రాల ప‌రిధిలోనే ఉన్నాయి. కానీ, ఇప్పుడు జాతీయ విద్యావిధానం తీసుకువ‌చ్చారు. దీంతో విద్య‌.. 60 శాతానికి పైగా కేంద్రం చేతిలోకి వెళ్లిపోయింది. ఒక‌ప్పుడు ఎంబీబీఎస్ త‌దిత‌ర ఉన్నత విద్య‌ల‌ను కూడా.. రాష్ట్రాలు నిర్వహించేవి. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేకుండా పోయింది. ఇక‌, రైత‌లు, ఉపాధి అంశాల్లోనూ కేంద్రం పెత్త‌నం పెరిగిపోయింది.

మ‌రీ ముఖ్యంగా మీరు ఈ ప‌నిచేస్తే.. ఇంత అప్పులు ఇస్తాం.. అనే ప‌ద్ధ‌తికి కేంద్రం రావ‌డంపై రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్నా యి. అదేస‌మ‌యంలో గ్రాంట్లు త‌గ్గించేసి.. అప్పుల దిశ‌గా రాష్ట్రాల‌ను ప్రోత్స‌హిస్తున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. ఇదేస‌మ‌యం లో ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కు కూడా.. రాష్ట్రాల్లోని పార్టీలు వెనుక‌బ‌డుతున్నాయి. ఉచితాల‌ను కేంద్ర‌మే నేరుగా ఇచ్చేస్తే.. రాష్ట్రాలు ఏం చేయాల‌న్నది సందేహం.

ఢిల్లీలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇదే ప్ర‌భావం క‌నిపించింది. అదేస‌మ‌యంలో స‌మ‌యానికి త‌గిన విదంగా ఎమ్మెల్యేల‌పై కేసులు పెట్ట‌డం, ఎంపీల‌పై విచార‌ణ‌ల‌తో వేధించ‌డం వంటివి కూడా.. కేంద్రీకృత మ‌వుతున్న పాల‌న‌ను క‌ళ్ల‌కు క‌డుతోంద‌ని అంటున్నారు మేధావులు. ఈ ప‌రిణామాలు మంచిది కాద‌ని అంటున్నారు. వ‌న్ నేష‌న్‌-వ‌న్ ఎల‌క్ష‌న్‌, వ‌న్ నేష‌న్‌-వ‌న్ రేష‌న్‌.. ఇలా.. అనేక ఉదాహ‌ర‌ణ‌ల‌ను వారు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News