హసీనా తలరాతను డిసెంబర్ లోనే మనోడు చెప్పేశాడు

బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Update: 2024-08-07 05:16 GMT

బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఏళ్లకు ఏళ్లుగా బంగ్లాదేశ్ ను ఏకఛత్రాధిపత్యంతో పాలించిన ఆమె.. చివరకు దిక్కు తోచని పరిస్థితుల్లో తన దేశం నుంచి భారత్ కు పారిపోవాల్సి వచ్చింది. లండన్ కు వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న కోటా రిజర్వేషన్ల చిచ్చు.. హసీనా రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేయటమే కాదు.. ఆమె భవిష్యత్తుపై నీలినీడలు అలుముకునేలా చేశాయి.

బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులకు.. వారి పిల్లలకే కాదు.. తాజాగా వారి మునిమనవళ్లు.. మనమరాళ్లకు సైతం 30 శాతం రిజర్వేషన్ల కోటా ఇవ్వటంపై భగ్గుమన్న విద్యార్థి లోకం తిరగబడటంతో బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు తలెత్తాయి. అయితే.. ఈ కల్లోల వాతావరణాన్ని.. షేక్ హసీనాకు ఎదురయ్యే ముప్పును ముందుగానే భారత్ కు చెందిన ఒక జ్యోతిష్యుడు అంచనా వేశారు. గత డిసెంబరులోనే ఎక్స్ వేదికగా చేసుకొని ఒక ట్వీట్ చేశారు. తాజాగా ఆ ట్వీట్ వైరల్ గా మారింది.

ప్రముఖ అస్ట్రాలజర్ ప్రశాంత్ కిని.. డిసెంబరు 14లో ట్వీట్ చేశారు. దాని సారాంశం చూస్తే.. ‘‘బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రధాని హసినా పదవీచ్యుతరాలు అవుతారు. ఆమె అత్యంత జాగ్రత్తగా ఉండాలి. హత్యాయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి సంబంధించి నా అంచనాలు ఇవే. 2024 మే నుంచి ఆగస్టు వరకు ఆమె చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ పేర్కొన్నట్లే తాజా పరిణామాలు ఉండటం గమనార్హం.

తన పాత ట్వీట్ తాజాగా వైరల్ కావటంతో ప్రశాంత్ కిని స్పందించారు. ఆగస్టు 2024లోఇబ్బందులు తప్పవని జ్యోతిష్యం చెప్పాను.. ఆమె దేశం విడిచి వెళ్లిపోయారని తాజాగా పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఒక నెటిజన్.. దేశంలో పరిస్థితులపై అంచనాలేమిటని ప్రశ్నిస్తూ.. సరైన సమయంలో చెప్పాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల చోటు చేసుకున్న వయనాడ్ విపత్తుపై జూన్ లోనే తన అంచనాలు వెల్లడించారు.

జులై మొదటివారంలో కురిసే రికార్డు స్థాయి వర్షాలు.. భారత పశ్చి తీరంలోని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. అంతేకాదు.. దక్షిణాదిలోనిపలు కొండ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరుగుతుందని.. కొండ చరియలు విరిగిపడతాయని అంచనాలు చెప్పారు. అతగాడు అంచనా వేసినట్లే కేరళలో పెను విషాదం చోటు చేసుకోవటం గమనార్హం.

Tags:    

Similar News