ఈటలకు ఎర్త్ పెడుతున్న బండి : టీ బీజేపీలో ఇదేం లొల్లి

కాబోయే ప్రెసిడెంట్ ను ఉద్దేశించే మాజీ ప్రెసిడెంట్ ఈ డైలాగ్స్ పేల్చుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2025-02-01 01:30 GMT

తెలంగాణ బీజేపీలో అంతర్యుద్ధం పతాకస్థాయిలో కొనసాగుతోంది. నేడో రేపో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనగా ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కాబోయే ప్రెసిడెంట్ ను ఉద్దేశించే మాజీ ప్రెసిడెంట్ ఈ డైలాగ్స్ పేల్చుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీ.బీజేపీలో చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవి కాస్త తగ్గినట్లు అనిపించినా, ఇటీవల కాలంలో మళ్లీ మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పీఠం ఆశిస్తున్న సీనియర్ నేత ఈటల దూకుడు మీద ఉండటం ఆయన వ్యతిరేక వర్గానికి రుచించడం లేదని అంటున్నారు. మూడేళ్ల క్రితం బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఈటల ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర బీజేపీకి అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే పార్టీ సారథ్యం అప్పగించాలని టీ.బీజేపీలో ఓ వర్గం డిమాండ్ చేస్తోందంటున్నారు.

ముఖ్యంగా పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. పద్మ అవార్డులు సందర్భంగా ప్రజా యుద్ధనౌక గద్ధరును ఉద్దేశించి బండి చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. గద్ధరుకు పద్మా అవార్డు ఇవ్వాలనే డిమాండ్ పై స్పందించిన కేంద్ర మంత్రి బండి కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నవారికి అవార్డులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీంతో ఆయన పరోక్షంగా ఈటలకు పదవిపైనా ప్రశ్నించినట్లైంది.

బీఆర్ఎస్లో చేరకముందు ఈటలకు కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉండేవి. ఆ నేపథ్యంతోనే ఆయన తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ తో రాజకీయాలు కొనసాగించారు. దాదాపు 8 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విభేదాల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దీటుగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నారు.

అయితే ఈటల ప్రయత్నాలకు బీజేపీలో కొందరు అడ్డుగా నిలుస్తువచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా 2023కి ముందు బీజేపీ సారథిగా పనిచేసిన ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణలో కమలం పార్టీకి ఊపు తెచ్చారు. అయితే ఈటల బీజేపీలో జాయిన్ అయిన తర్వాత బండి కథ వేరేలా మారిందని చెబుతారు. దీంతో ఎన్నికల ముందు బండిని పార్టీ సారథ్యం నుంచి తప్పించారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం ఉంది. ఇప్పటికీ కూడా ఇద్దరు నేతల మధ్యే అవే విభేదాలు కొనసాగుతున్నాయని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఈటలకు ఎర్త్ పెట్టేలా కేంద్ర మంత్రి సంజయ్ పరోక్ష విమర్శలు గుప్పిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

కమ్యూనిస్టులకు అవార్డులే ఇవ్వొద్దనే వాతావరణం ఉంటే పార్టీ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదే సమయంలో ఈటల స్థానంలో తెలంగాణకు చెందిన ఆర్ఎస్ఎస్ తో బలమైన బంధం ఉన్న ఓ తెలంగాణ నేత తన అనుచరుడికి బీజేపీ అధ్యక్ష పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి బండి సహకారం కూడా ఉందని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాషాయ దళపతి ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News