బాలినేనికి లక్ తగలబోతోందా ?

బాలినేని కనుక కూటమిలో మంత్రి అయితే వైసీపీకి రాజకీయంగా దబిడి దిబిడే అవుతుంది అని అంటున్నారు.

Update: 2024-12-01 20:30 GMT

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గత పాతికేళ్ళుగా ఆయన రాజకీయంగా జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు. మొదట కాంగ్రెస్ తరువాత వైసీపీ ఇలా రెండు పార్టీలలో ఆయన తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితం ఆయన వైసీపీ నుంచి వేరుపడి జనసేనలో చేరారు.

ఆయన జనసేనలో ఏ రకమైన పాత్ర పోషించ బోతున్నారు అన్న చర్చ ఒక వైపు జరుగుతూండగానే ఆయన ఇటీవల కాలంలో అదానీతో వైసీపీ ప్రభుత్వం అప్పట్లో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల మీద విమర్శలు చేశారు. విద్యుత్ శాఖ మంత్రిని అయిన తనకే తెలియకుండా ఆ ఒప్పందాలు కుదిరాయని ఆయన బాంబు లాంటి వార్తనే పేల్చారు. ఈ విధంగా ఆయన జగన్ మీద డైరెక్ట్ ఎటాక్ చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే బాలినేని ఈ విధంగా వైసీపీ హై కమాండ్ నే ఇరకాటంలో పెడుతూండడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. అయితే బాలినేని సేవలను మరింతగా ఉపయోగించుకోవాలన్న జనసేన ఎత్తుగడలో భాగమే ఇదంతా అని అంటున్నారు. బాలినేనిని పార్టీలో తీసుకున్నప్పుడే ఆయనకు ఒక కీలకమైన హామీ లభించింది అని అంటున్నారు.

దాని ప్రకారం ఆయన తొందరలోనే ఎమ్మెల్సీ కాబోతారని అంతే కాదు కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక బెర్త్ ఆయన కోసమే అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఒంగోలు జిల్లా నుంచి చూస్తే డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ మంత్రులుగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు.

అయితే రాజకీయంగా చైతన్యం కలిగిన ఈ జిల్లాకు మూడో మంత్రి పదవి ఇచ్చినా రాజకీయ సమీకరణలకు సరిపోతాయని అంటున్నారు. ఆ విధంగా చూస్తే బాలినేనికి మంత్రి పదవి కూడా దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. బాలినేనిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలన్న దాని మీద పవన్ అయితే పట్టుదలగా ఉన్నారని అంటారు.

జనసేనకు అయితే పవన్ తో కలుపుకుని ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇపుడు బాలినేనికి మంత్రి పదవిని ఇప్పించడం ద్వారా నాలుగో పదవిని తీసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. అంతే కాదు జనసేన కమ్మ కాపు కాంబోతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో పట్టు సాధించేందుకు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.

ఇక చూస్తే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న బాలినేనికి ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పట్టు ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇప్పించడం ద్వారా జనసేనను వచ్చే ఎన్నికల్లో మరింతగా పటిష్టం చేసుకోవాలని వ్యూహం ఉందని అంటున్నారు.

అంతే కాదు బాలినేని జగన్ కి బంధువు. అలా ఆయనకు మంత్రి పదవి ఇప్పించడం ద్వారా వైసీపీ మూలాల మీదనే దెబ్బ కొట్టాలని మాస్టర్ ప్లాన్ ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే శాసనమండలిలో ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు స్పీకర్ మోషెన్ రాజు పరిశీలనలో ఉన్నాయి.

పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకట రమణ తమ రాజీనామాలు సమర్పించారు. మండలి చైర్మన్ దీని మీద నిర్ణయం తీసుకుంటే ఆ సీట్లకు ఖాళీ ఏర్పడుతుంది. దాంతో వీటిలో ఒకదానికి బాలినేనిని ఎంపిక చేస్తారు అని అంటున్నారు. ఆ తరువాత ఆయనను మంత్రిగా కూడా చేసేందుకు జనసేన అధినాయకత్వం ఉత్సాహ పడుతోంది అని అంటున్నారు. బాలినేని కనుక కూటమిలో మంత్రి అయితే వైసీపీకి రాజకీయంగా దబిడి దిబిడే అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఆచరణలోకి వచ్చేది ఎపుడో అన్నది.

Tags:    

Similar News