వైఎస్ షర్మిల ఆ తప్పు చేయకుండా ఉండటమే ఉత్తమమా?
ఆమెకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమెకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తాను సంతోషంగా తప్పుకుంటానని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ప్రకటించారు.
అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ+జనసేన కూటమి మధ్యే ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి విజయం సాధిస్తుందని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర పార్టీలకు ఏమాత్రం అవకాశం ఉండదని పేర్కొంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆమెకు ఎలాంటి లాభం లేదనే టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత, ఎన్నికల సన్నద్ధత ఇలా పలు బలహీనతలు ఆ పార్టీకి ఉన్నాయని అంటున్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా, పెట్టని కోటగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, ముస్లింల్లో అత్యధిక భాగం ఇప్పుడు వైసీపీ వెంట ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఈ వర్గాల ఓట్లనే చీల్చుకునే అవకాశం ఉంటుందంటున్నారు. దీనివల్ల ఆమెకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే టాక్ నడుస్తోంది.
ఈ వచ్చే ఎన్నికల్లో షర్మిల ఏపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వచ్చే ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకుంటే ఆ తర్వాత అంటే 2029 ఎన్నికలకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలా కాకుండా ఈ ఎన్నికల్లోనే షర్మిల పోటీ చేస్తే తెలంగాణలో జనసేన పార్టీకి ఎదురయిన ఫలితాలే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. అదే జరిగితే షర్మిల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టి కాలికి బలపం కట్టుకుని 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా షర్మిల పార్టీలో ఎవరూ చేరలేదని గుర్తు చేస్తున్నారు. ఓటమి భయంతోనే ఆమె తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెబుతున్నారు.
కాబట్టి ఏపీలో సైతం పోటీకి దూరంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ లేదా టీడీపీ+జనసేనల్లో ఏదో ఒకటి అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మరి షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!