కేసీఆర్ సారూ.. ఎక్కడ మీరు..? చీల్చి చెండాడేది ఎప్పుడు?
దీంతోనే కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉన్నారా? హైదరాబాద్ లో ఉన్నారా? అని ప్రశ్నలు వేస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ ఎక్కడ..? చివరిసారిగా గత నెల ఆఖరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక కేసీఆర్ శాసనసభకు 20 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేతగా వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన ఆయన.. కేవలం ఒక్క రోజే సభకు హాజరయ్యారు. హామీల అమలు విషయంలో అధికార పార్టీని చీల్చిచెండాడుతానని ప్రకటించారు. కానీ.. మీడియా పాయింట్ లో ఆ ప్రకటన తర్వాత కేసీఆర్ మళ్లీ కనిపించలేదు. ఇంతకూ ఆయన ఎక్కడ ఉన్నారు?
హైదరాబాద్ లోనా? ఫాం హౌజ్ లోనా?
కేసీఆర్ తెలంగాణ ఎన్నికలలో ఓటమి అనంతరం నేరుగా ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడే అనూహ్యంగా గాయపడ్డారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ నందినగర్ లోని ఇంట్లోనే ఉంటున్నారు. లోక్ సభ ఎన్నికల నాటికి గాయం నుంచి కోలుకున్న కేసీఆర్ ప్రచారం కూడా చేశారు. ఇక జూలై ఆఖర్లో అసెంబ్లీకి తొలిసారిగా వచ్చారు. అంటే సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ, ఆ తర్వాతి నుంచి బీఆర్ఎస్ అధినేత ప్రజలకు కనిపించలేదు. దీంతోనే కేసీఆర్ ఫాంహౌజ్ లో ఉన్నారా? హైదరాబాద్ లో ఉన్నారా? అని ప్రశ్నలు వేస్తున్నారు.
ఏం వ్యూహాలు పన్నుతున్నారో?
ఎన్ని విమర్శలు ఉన్నా కేసీఆర్ వ్యూహ చతురతను మెచ్చుకోకుండా ఉండలేం. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో మెదక్ ఎంపీగా కూడా ఉన్న కేసీఆర్ తన ఫాంహౌజ్ నుంచే మొత్తం వ్యూహాన్ని నడిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఖరారైన దశలోనే పార్లమెంటుకు వెళ్లారు. అందుకే కేసీఆర్ మౌనం.. ఓ భారీ వ్యూహానికి నేపథ్యం అనుకోవాలేమో..? అంతేకాదు.. కేసీఆర్ ఇప్పుడు చక్రబంధంలో ఉన్నారు. ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతున్నారు. స్వయంగా కుమార్తె కవిత జైల్లో ఉన్నారు. రాజకీయంగానూ కేసీఆర్ ను రేవంత్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరోవైపు బీజేపీలో విలీనం చేస్తున్నారనే ఆరోపణలకు దిగుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక అడుగు వెనక్కు వేయడమే ఉత్తమం అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరి కేసీఆర్ మళ్లీ ఎప్పుడు మనకు కనిపిస్తారో.. తనదైన శైలిలో మీడియా ముందు ప్రత్యర్థులను ఎలా ఆడుకుంటారో చూద్దాం..