రూపాయి జీతం తీసుకోని అంబానీ మరి కుటుంబ సభ్యులు?

ఇదిలా ఉంటే.. రిలయన్స్ గ్రూప్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ముకేశ్ అంబానీ.. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఉండటం గమనార్హం.

Update: 2024-08-08 05:10 GMT

ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో పదకొండో స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి.. ఆయన వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 109 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. ఇటీవలే తన చిన్నకొడుకు పెళ్లిని వందలాది కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేసి.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా నిర్వహించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రిలయన్స్ గ్రూప్ కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ముకేశ్ అంబానీ.. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా ఉండటం గమనార్హం.

కరోనా వేళ నుంచి జీతాన్ని తీసుకోవటం ఆపేసిన ఆయన మాత్రమే కాదు.. బోర్డులోకి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులు సైతం జీతాలు తీసుకోవటం లేదు. అయితే.. కొన్నిఖర్చులకు మాత్రం కొంత మొత్తాన్ని తీసుకుంటున్నారు. కరోనాకు ముందు వేతనాల విషయంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఆదర్శంగా ఉండాలంటూ 2009 నుంచి 2020 వరకు తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో తన జీతాన్ని పూర్తిగా వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జీతమే తీసుకున్నది లేదు.

ఇక.. ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు (ఇషా.. ఆకాష్.. ఆనంత్).. ఆయన సతీమణి నీతూ అంబానీ విషయానికి వస్తే.. వారు ఎలాంటి జీతాలు తీసుకోవటం లేదు. కాకుంటే పిల్లలు ముగ్గురు సిట్టింగ్ ఫీజుగా రూ.4 లక్షలు.. కమిషన్ కింద రూ.97 లక్షల్ని ఒక్కొక్కరు పొందుతున్నారు. ఇక.. బోర్డులో 2023 ఆగస్టు 28 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించిన నీతూ అంబానీ సిట్టింగ్ ఫీజు కింద రూ.2 లక్షలు.. కమిషన్ కింద రూ.97 లక్షలు తీసుకునేవారు. కంపెనీ నుంచి రూపాయి జీతం తీసుకోని ముకేశ్ అంబానీ.. తన వ్యాపార పర్యటనల సమయంలో అయ్యే ఖర్చుల్ని కంపెనీనే చెల్లించేలా ఏర్పాటు ఉంది. అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రక్షణకు అవసరమైన ఖర్చులు మొత్తాన్నికంపెనీనే భరిస్తుంది.

Tags:    

Similar News