సూసైడ్ అటెంప్టు చేసి భర్త మీద నెట్టేయటం క్రూరం.. హైకోర్టు

తాజాగా అలాంటి వైనాన్ని కేసు విచారణ సమయంలో న్యాయస్థానం గమనించిన సందర్భంలో సదరు న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది.

Update: 2024-01-10 06:30 GMT

కొన్ని సెంటిమెంట్ల పేరుతో కొన్ని వర్గాలకు దశాబ్దాలుగా జరిగే అన్యాయంపై మాట్లాడేవారెవరూ లేరా? ఇలాంటివి ఎప్పటికి బద్ధలు అవుతాయన్న వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో వింటుంటాం. అలాంటి కోవలోకే వస్తుంది.. భర్త.. అతడి తరఫు వారిపై తప్పుడు కేసులు పెట్టేయటం.. తాము కోరుకున్నది సాధించేందుకు చట్టంలో తమకున్న వెసులుబాటును వినియోగించుకొని కేసులు పెట్టేసే ధోరణి చాలాసందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి వైనాన్ని కేసు విచారణ సమయంలో న్యాయస్థానం గమనించిన సందర్భంలో సదరు న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది. కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి పరిస్థితి ఢిల్లీ హైకోర్టులో చోటు చేసుకుంది.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. దాన్ని భర్త.. అతడి తరఫు వారి మీదకు నెట్టేయటం క్రూరమైన చర్యగా అభివర్ణించింది ఢిల్లీ హైకోర్టు. తప్పుడు కేసులు పెడతామని బెదిరింపులకు దిగటాన్ని తప్పు పట్టింది. ఇదే విషయాన్ని గతంలోని కొన్ని కేసుల విచారణ సమయంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేవారు. తాజాగా విడాకుల మంజూరును తప్పు పడుతూ కేసు పెట్టిన భార్య తీరు సరికాదని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.

జస్టిస్ సురేశ్ కుమార్ కైత్.. జస్టిస్ నీనా బన్సల్ క్రిష్ణ ధర్మాసనం ముందుకు భార్య.. భర్తల పంచాయితీ ఒకటి వచ్చింది. ఈ కేసులో కింది కోర్టులో భర్తకు మంజూరైన విడాకులను తప్పు పడుతూ.. భార్య హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. పిటిషనర్ ఆరోపించినట్లుగా ఎలాంటి వేధింపులు భార్యకు ఎదురు కాలేదన్న విషయాన్ని విచారణలో గుర్తించింది. భర్తపై భార్య చేసిన ఆరరోపణల్ని చూస్తే.. ‘అత్తారింట్లో సరైన ఆహారం పెట్టలేదు. బలమిచ్చే టానిక్ పేరుతో దోమల నివారణ మందును భర్త తాగించాడు’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది.

అయితే.. కోర్టు విచారణ వేళ.. భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయంలో భర్త ఆఫీసులో ఉన్నట్లుగా భార్య ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో భర్త మీద నింద వేసే కొందరు భాగస్వామ్యుల తీరును కోర్టు ప్రస్తావిస్తూ.. ఇలాంటి చర్యలు క్రూరమైనవని వ్యాఖ్యానించింది. తప్పుడు కేసులు పెడతామని బెదిరింపులకు దిగటం కూడా భర్త.. అతని తరఫు వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేయటమేనని పేర్కొంది. కింది కోర్టు మంజూరు చేసిన విడాకుల్ని బలపర్చిన హైకోర్టు.. ఒకవేళ.. తాజా కేసులో భార్య చనిపోయి ఉంటే భర్త పరిస్థితేంటి? అంటూ ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు తప్పుడు కేసులుపెట్టి.. భర్త.. అతడి తరపు కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులకు గురి చేయాలని భావించే వారికి చెంపదెబ్బ అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News