సంక్రాంతి తరువాత జనంలోకి జగనన్న
జగన్ పట్టుదల కలిగిన వారు. గిట్టని వారు మొండి అని అంటారు.
జగన్ పట్టుదల కలిగిన వారు. గిట్టని వారు మొండి అని అంటారు. బద్ధ వ్యతిరేకులు అయితే జగ మొండి అని కూడా అంటారు. ఎవరు ఏమన్నా జగన్ మాత్రం తన రూటే సెపరేట్ అంటారు. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళినా ఆయన మాత్రం ఉన్న వారితోనే అంటున్నారు. వరసబెట్టి ఆయన జిల్లా కార్యవర్గాలను నియమిస్తున్నారు.
వీరంతా తనకు విధేయులుగా ఉంటారు అనుకుని ఆయన బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలా ఆయన ప్రస్తుతం చేస్తున్న పని ఆసక్తితో పాటు ఆలోచనలనూ రేకెత్తిస్తోంది. ఒక వైపు చూస్తే వైసీపీ ఎత్తిపోతోందని టీడీపీ కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి.
తాము గేట్లు తెరిస్తే చాలు వైసీపీ అంతా ఖాళీ అని కూడా చెబుతున్నారు. గేట్లు అలా తెరుస్తున్నారు, చేర్చుకుంటున్న వారికి కండువాలు కప్పుతున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం జనం నుంచి నాయకులు రావాలని అంటోంది.
పార్టీ ఓటమి చెందాక జగన్ కూడా ఒకింత డీలా పడ్డారు. అయితే ఆయన జిల్లాల టూర్లు చేస్తున్నపుడు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఆయనలో భరోసా ఏర్పడింది అని అంటున్నారు. ఆయన కడప జిల్లాకు వెళ్ళినా గుంటూరు వెళ్ళినా విజయవాడతో పాటు పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళినా జనాలు బాగానే వచ్చారు.
దాంతో జగన్ లో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది అని అంటున్నారు. అందుకే ఆయన నాయకులు పోయినా జనం తనతోనే ఉన్నారు అని అంటున్నారు. జనం నుంచే నాయకులు వస్తారు అని కూడా అంటున్నారు. దాంతో ఆయన పార్టీకి బాధ్యులుగా జిల్లాల వారీగా సీనియర్లను నియమించే పనిలోనే ప్రస్తుతం ఉన్నారు.
అలా మొత్తం అన్ని జిల్లాలకు బాధ్యూలను నియమించిన తరువాత నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించి అపుడు జనంలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి అయ్యేసరికి ఈ ఏడాది పూర్తి కావచ్చు అని అంటున్నారు. అంటే జగన్ సంక్రాంతి పండుగ తరువాత జనంలోకి రావాలని అనుకుంటున్నారు.
అప్పటి నుంచే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడెనిమిది నెలలు అవుతుందని ప్రజలకు కూడా ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుందని ఆ సమయంలో తాను జనంలోకి వెళ్తే దానికి తగినట్లుగా రియాక్షన్ వస్తుందని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
ఈ లోగా పార్టీ నియామకాలు చేపడుతూ అవసరం అనుకున్నాపుడే జనంలోకి వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా అంబటి రాంబాబుని క్రిష్ణా జిల్లా ప్రెసిడెంట్ గా పేర్ని నానిని, ఎన్టీఆర్టీ జిల్లా ప్రెసిడెంట్ గా దేవినేని అవినాష్ ని జగన్ నియమించారు.
దీంతో సగం పైగా జిల్లాలకు వైసీపీ బాధ్యుల నియామకం పూర్తి అయింది అని అంటున్నారు. గోదావరి జిల్లాలలోనే వైసీపీకి కత్తి మీద సాముగా వ్యవహారం ఉందని అంటున్నారు. అక్కడ జిల్లా బాధ్యులుగా ఎవరిని నియమించాలన్నది ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే విశాఖ, అనకాపల్లి అల్లూరి జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించలేదు.
జనసేన టీడీపీ బలంగా ఉన్న గోదావరి ఉత్తరాంధ్రాల మీద జగన్ ఫోకస్ పెట్టాలని తొందరగా జిల్లా అధ్యక్షులను నియమించాలని కోరుతున్నారు. ఈ రెండు రీజియన్లూ కలిపి 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కనుక స్కోర్ చేయకపోతే వైసీపీ ఇబ్బందులో పడుతుందని అంటున్నారు. అయితే జగన్ మాత్రం తనదైన స్ట్రాటజీతోనే వెళ్తున్నారు అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో ప్రస్తుతం జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక బలమైన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చినా తీసుకుంటారా లేదా అన్న డౌట్లూ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కనుక జగన్ అయితే ఉన్న వారితోనే వైసీపీ బండిని పరుగులు తీయించాలని చూస్తున్నారు.