జగన్‌కు 'బటన్' బాధ.. పోయేదెప్పుడు.. !
తాజాగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ముఖ్య నాయకులతో జగన్ భేటీ అవుతున్నారు.
చంద్రబాబు పాలన అంటే.. షడ్రశోపేతం.. అనుకునే వారు కూడా ఇప్పుడు ఒకింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పాలన అంటే.. గతంలో జగన్ చేసినట్టు బటన్ నొక్కడం కాదని.. కొన్ని పెట్టుబడు లు.. కొన్ని ఉద్యోగాలు, మరికొంత ఉపాధి కల్పన.. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం.. అనే కీలక అంశాల ఆధారంగా రాష్ట్రంలో అయినా.. దేశంలో అయినా పాలన సాగుతుంది. నిజానికి జగన్ హయాంలో ఏం జరిగిందనే పెద్ద చర్చ. పైకి ఆయనే స్వయంగా చెప్పుకొన్నట్టు బటన్ నొక్కడానికే పరిమితమయ్యారు.
దీంతో ఓ సెక్షన్ ప్రజలు జగన్‌ను ఇంటికి పంపించేశారు. ఒక విప్లవం మాదిరిగా తరలి వచ్చిన ప్రజలు భారీఎత్తున వ్యతిరేక ఓటు వేశారు. దీనికి కారణం బటన్ సిఎం అన్న ముద్ర పడడమే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ''నేను ఏం చేయగలను. బటన్ మాత్రమే నొక్కగలను. మీరు ఇంటింటికీ వెళ్లి.. బటన్ నొక్కడం ద్వారా జరిగే లబ్ధిని వివరించాలి'' అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు గతంలోనే జగన్ క్లాసు ఇచ్చిన విషయం తెలిసిందే.
కట్ చేస్తే.. అసలు ఇప్పుడు ఎందుకీ చర్చ? అనేది కీలకంగా మారింది. తాజాగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ ముఖ్య నాయకులతో జగన్ భేటీ అవుతున్నారు. ఈ భేటీకి వస్తున్న కొందరు ఉత్తరాంధ్ర, రాయల సీమ నాయకులు.. ఉన్నది ఉన్నట్టు జగన్‌కు చెప్పాలనినిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే.. ''సోషల్ మీడియాలో మానాయకుడిని బటన్ సీఎం అని చెబుతున్నారు. ఆయన అభివృద్ధి సీఎం అంట. మా నాయకుడు బటన్ సీఎం అంట. ఇది కొంచెం తేడాగానే ఉంది. ఎన్నికలకు ముందు మేం సరిచేసుకుని ఉండాల్సింది. ఇప్పుడైనా సరిచేసుకునే ప్రయత్నం చేస్తాం'' అని కీలక నాయకుడు మాజీ మంత్రి ఒకరు చెప్పారు.
అంటే.. ఈ విషయాన్ని తాజాగా నిర్వహించే సభలో చర్చించనున్నారని అర్ధమైంది. వాస్తవానికి ఒక సీఎంపై అభివృద్ధి, పెట్టుబడుల సారథి, లేదా డౌన్‌టు ఎర్త్ అన్నట్టుగా వ్యవహరించాలన్న కోణంలో పేరు వచ్చి ఉంటే అది వేరేగా ఉండేది. కానీ, ఆదిశగా జగన్ అడుగులు వేయకపోవడం.. సహజంగానే ప్రత్యర్థులు అన్నీ తీవ్రస్థాయిలో చూపించడం నేపథ్యంలో ఆయనపై బటన్ సీఎం అనే ముద్ర పడింది. ఇప్పుడు దీనిని తొలగించుకుంటే తప్ప.. మెజారిటీ మధ్య తరగతి ప్రజలు ఆయనకు మద్దతు పలికే అవకాశం లేదని అంటున్నారు.