జగన్ అభిమాన జనం లెక్క తేలిపోతుందా ?

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అంటే జై అంటూ హోరెత్తించే అభిమానులు ఉన్నారు, అనుచరులూ ఉన్నారు.

Update: 2024-12-20 03:37 GMT

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అంటే జై అంటూ హోరెత్తించే అభిమానులు ఉన్నారు, అనుచరులూ ఉన్నారు. వారే క్యాడర్ గా మారి పార్టీని గెలిపించారు కూడా. జగన్ కోసం ఏమైనా చేస్తాం ఎందాకైనా అంటూ హుషారెత్తించారు కూడా. జగన్ 2011లో పార్టీ పెట్టిన నాటి నుంచి తన సర్వస్వం ఆయనే అనుకుని పనిచేసిన వారూ ఉన్నారు.

అంతకు ముందు జగన్ వైఎస్సార్ కుమారుడిగా ఆరాధించిన వారూ ఉన్నారు. ఇవన్నీ కలసి 2019లో ఆయనను సీఎం గా చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ సంగతి అలా ఉంచితే వైసీపీ అయిదేళ్ళ పాటు పాలించింది. జగన్ సీఎం గా ఉండగా 2019లో తొలి పుట్టిన రోజుని చేసుకున్నారు. అది ఘనంగా గొప్పగా ఇంకా చెప్పాలంటే దివ్యంగా సాగిపోయింది.

ఆ తరువాత 2020, 2021లలో కరోనా ప్రభావం ఉన్నా జగన్ అభిమాన జనం గట్టిగానే పుట్టిన రోజు వేడుకలను జరిపించారు. ఇక 2022, 2023లలో కూడా అధికారంలో ఉన్న పార్టీగా ఆశావహులు ఆశ్రితులు ప్రాపకం కోరే వారు అంతా కలసి జగన్ బర్త్ డే అంటే చాలా గ్రేట్ అన్న తీరున జరిపించేశారు.

ఇక ఇపుడు అసలైన టెస్టింగ్ టైం అన్నట్లుగానే ఉంది. జగన్ కి కూడా ఇది కొత్త అనుభవం. ఆయన 2018 దాకా విపక్ష నేతగా బర్త్ డేలు చేసుకునే వారు. ఈసారి మాత్రం మాజీ ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం బర్త్ డే జరుపుకుంటున్నారు.

అందరికీ తెలిసిన విషయమేంటి అంటే అధికారాంతమున వైభోగాలు తీరు చూడమని చెబుతారు. అంటే పదవులు పోయాక ఎవరు ఎవరో తెలిశాక అపుడు ఏ పని తలపెట్టినా వెంట ఉండే ఆ నలుగురే నిజమైన వారు అని అర్ధం. అలా చూస్తే కనుక జగన్ ఇంకా జనంలోకి రాక ముందే ఆయన ప్రజా క్షేత్రంలో పర్యటనలు ఆరంభించకముందే ఒక అంచనాగా వేసుకోవడానికి ఈ పుట్టిన రోజు వేడుకలను తీసుకోవచ్చు అని అంటున్నారు.

పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకోవడం వేరు. ఏకంగా అధినేత పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడం వేరు. దానికి వీలు లేదు, కుదరదు అని అన్నారూ అంటే కచ్చితంగా అలాంటి లీడర్స్ ట్రాక్ తప్పుతున్నట్లుగానే భావించాలి. ఇక పోతే గత వారం రోజులుగా జగనన్న బర్త్ డే వేడుకలు అంటూ వైసీపీ నుంచి ప్రకటనలు వస్తున్నాయి.

మరి దానికి రియాక్ట్ అయి పార్టీ జనాలు ఎంత మంది గత అయిదేళ్ళ మాదిరిగా గొప్పగా చేస్తారు అన్నదే ఇక్కడ కొలమానంగా చూడాలి. అధికారంలో ఉన్నపుడు అధినేత పుట్టిన రోజు అంటే చొక్కాలు చింపుకోవడం కాదు, పార్టీతో పాటు అధినాయకుడు కష్టంలో ఉన్న వేళ మేమున్నాం జగనన్నా అంటూ సింబాలిక్ గా చెప్పేందుకు అయినా ఈ వేడుకలు నిర్వహిస్తే అదే వైసీపీకి కూడా వేయేళ్ల ఆయుష్షుగా మారుతుంది.

మరి అంతటి ప్రేమాభిమానాలు లీడర్లలో ఎంతమందికి ఉన్నాయి అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ బర్త్ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు ఎవరు గ్రీట్ చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఈ నెల 21న జగన్ పుట్టిన రోజు వేడుకలు ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తిని పెంచే అంశంగా ఉంటాయని అంటున్నారు. వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News