వైఎస్సార్ అడుగుజాడలే జగన్ కి ఆలంబన

వైఎస్ జగన్ అన్న పేరు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది అంటే దానికి కారణం దివంగత నేత ప్రజా నాయకుడు వైఎస్సార్ అని కచ్చితంగా చెప్పాలి.

Update: 2024-09-02 14:11 GMT

వైఎస్ జగన్ అన్న పేరు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది అంటే దానికి కారణం దివంగత నేత ప్రజా నాయకుడు వైఎస్సార్ అని కచ్చితంగా చెప్పాలి. వైఎస్సార్ బ్లడ్ కాబట్టే జగన్ కి ఇంత ఆదరణ లభించింది. జగన్ వైఎస్సార్ జయంతులు వర్ధంతుల వేళ ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్దకు చేరుకుని జగన్ కుటుంబ సమేతంగా నివాళులు అర్పిస్తూంటారు.

ఏపీలో 2009 సెప్టెంబర్ 2వ తేదీని ఎవరూ మరచిపోరు. ఆ రోజు వైఎస్సార్ రచ్చబండ కోసం చిత్తూరు జిల్లాకు హెలికాప్టర్ తో వెళ్తూ దుర్మరణం పాలు అయ్యారు. నాటి నుంచి వైఎస్సార్ జయంతి వర్ధంతులు ఆయన కుటుంబానికే కాదు ఆయనని ప్రేమించే వారికి కూడా గుర్తుండిపోయాయి.

ఇదిలా ఉంటే వైఎస్సార్ 15వ వర్ధంతి వేళ ఆయనకు నివాళి అర్పించారు జగన్. అయన తల్లి విజయమ్మతో కలసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జగన్ మిస్ యూ నాన్న అని రాసుకొచ్చారు. వైఎస్సార్ ని జగన్ మాత్రమే కాదు ఏపీ ప్రజలు మిస్ అయ్యారు.

వైఎస్సార్ ని జగన్ లో చూడాలని అనుకున్నారు. జగన్ కూడా తండ్రి బాటలో నడుస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆచరణలో పాలనలో వైఎస్సార్ తో పోల్చుకున్నపుడు జగన్ ఇంకా ఆయన అడుగుజాడలలో మరింత బలంగా చూసుకుంటూ నడవాల్సి ఉందని అంటున్నారు.

వైఎస్సార్ కి ప్రత్యర్థులే ఉండేవారు. వారు కూడా ఆయన దగ్గరకు వస్తే చాలు మిత్రులు అయిపోయేవారు. ఆయనలో మానవత్వం కోణం చాలా ఎన్నదగినది అని దగ్గరుండి చూసిన వారు చెబుతారు. ఒక్క చిరునవ్వుతో వైఎస్సార్ ఎన్నో సమస్యలకు సమాధానం చెప్పేవారు. ఆయన పేదలను ఎక్కువగా ప్రేమించేవారు ఆయన కుటుంబాన్ని ఎక్కువగా దగ్గరకు తీసుకునేవారు.

ఆయనని వ్యక్తిగతంగా ఎవరూ పల్లెత్తి విమర్శ చేయలేని విధనా ఆయన పయనం సాగింది. రాజకీయంగా విభేదాలు ఉండవచ్చేమో కానీ వైఎస్సార్ లో ఇది తప్పు అని ఎవరూ చెప్పలేని వంక పెట్టలేని విధంగా ఆయన ఆరు దశాబ్దాల తన జీవితాన్ని గడిపారు. జగన్ కూడా ఆయన బాటలో నడవాలని అంతా కోరుకుంటున్నారు.

వైఎస్సార్ కుటుంబం అంటే ప్రేమను పంచేది అన్న పేరు. జగన్ సైతం తన కుటుంబం విషయంలో ప్రత్యర్ధులు చేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేలా అందరినీ కలుపుకుని పోతే బాగుంటుంది అన్న మాటా ఉంది. గత కొన్నాళ్ల నుంచి వైఎస్సార్ జయంతులు అయినా వర్ధంతులు అయినా కుటుంబం రెండుగా చీలినట్లుగా కనిపిస్తోంది. ఎవరికి వారుగా ఘాట్ వద్దకు వచ్చి తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు అన్నా చెల్లెళ్ళు.

ఇక తల్లి విజయమ్మ కామన్ గా ఉంటూ అటు కొడుకు ఇటు కూతురుతో కనిపిస్తున్నారు. వైఎస్సార్ ని మనసారా అభిమానించేవారికి ఇవి కొంత బాధగా ఉన్నాయని అంటునారు. రాజకీయాలు ఎవరికి వారుగా చేసుకున్నా అభిమానం మాత్రం అలాగే ఉంచుకోవాలని కోరుతున్నారు. అదే సమయంలో అంతా ఒక్కటిగా వైఎస్సార్ పేరుతో స్థాపించిన పార్టీలో పనిచేస్తే అంతకంటే మహదానందం లేదు అని అంటున్నారు.

ఇక వైఎస్సార్ కి అసలైన నివాళి అంటే ఆయన పంచిన ప్రేమను అందరికీ పంచాలని కూడా అంటున్నారు. జగన్ తనదైన శైలిలో పాలన చేశారు. ఆయన పేదలకు సంక్షేమ పధకాలు వివిరిగా అందించారు. కానీ అదొక్కటే సరిపోదు, అందుకే వైఎస్సార్ ని మరింతగా తలచుకుని ఆయన స్పూర్తిగా ఇంకా గట్టిగా పనిచేస్తే వైసీపీకి కూడా అదే క్షేమం అని అంటున్నారు.

Tags:    

Similar News