మన్మోహన్ సింగ్ విషయంలో జగన్ అలా చేసి ఉండాల్సిందా ?

ఆయన దేశానికి అయిదేళ్ళ పాటు అత్యంత కష్ట కాలంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసి ఆర్ధిక సంస్కరణలకు తెర తీశారు

Update: 2025-01-01 03:30 GMT

దేశాన్ని దశ దిశ మార్చి కీలక మలుపు తిప్పిన గొప్ప ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అందులో రెండవ మాటకు చోటు లేదు. ఆయన దేశానికి అయిదేళ్ళ పాటు అత్యంత కష్ట కాలంలో ఆర్ధిక మంత్రిగా పనిచేసి ఆర్ధిక సంస్కరణలకు తెర తీశారు. దాని వల్ల దేశం ఎంతో ముందుకు సాగింది. పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసి ఎన్నో పధకాలకు శ్రీకారం చుట్టారు.

ఆయన రాజకీయ నేత కంటే కూడా రాజకీయ కోవిదుడుగా నిలిచారు. ఆయన దేశానికి ఒక విజనరీ నాయకుడిగా నిలిచారు. బేసికల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ మనిషి అయితే కావచ్చు. కానీ ఆయన గాంధీ కుటుంబీకుడు కాదు. ఆయన దేశం కోసం తనకు వచ్చిన అవకాశాలను విజయవంతంగా వాడుకున్నారు.

అంతే కాదు ఆయన ఒక రాజకీయ వేదీకగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలు చేసి ఉండవచ్చు. అంతే తప్ప ఆయనను ఒక పార్టీ మనిషిగా కట్టేయడానికి లేదు. అందుకే బీజేపీ ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో పెద్ద ఎత్తున జరిపించింది. ఆయన స్మారక చిహ్నానికి స్థలం కూడా కేటాయిస్తోంది.

మరి అదే సమయంలో దేశమంతా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పించింది. ఏపీ సీఎం గా ఉన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మన్మోహన్ సింగ్ కి నివాళి అర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్లకపోయినా ఆయన పార్టీ తరఫున నాయకులను పంపించారు.

కానీ ఏపీలో ప్రధాన పక్షంగా ఉంటూ అయిదేళ్ల పాటు సీఎం గా వ్యవహరించిన జగన్ ఒక సంతాప సందేశంతో సరిపెట్టేశారు అన్న కామెంట్స్ ఉన్నాయి. జగన్ ఢిల్లీకి వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తే బాగుండేది అని అంటున్న వారూ ఉన్నారు ఎందుకంటే జగన్ తండ్రి వైఎస్సార్ కి మన్మోహన్ సింగ్ మంచి మిత్రుడు ఇద్దరూ కలసి మెలసి ఒక అయిదేళ్ల పాటు రాజకీయాలలో నడిచారు అన్నది కూడా ఉంది.

ఇక రెండవ సారి మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన టైం లోనే జగన్ తొలిసారి కడప నుంచి ఎంపీగా గెలిచి వచ్చారు. అలా కాంగ్రెస్ ఎంపీగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో జగన్ కొంతకాలం పనిచేశారు ఇవన్నీ చూసుకున్నపుడు జగన్ వెళ్ళి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

జగన్ వెళ్ళి ఉంటే జాతీయ రాజకీయాలలో వైసీపీ కూడా తనదైన పంధాను కొనసాగించి ఉండేదని అంటున్నారు ఆ విధంగా కాకుండా జగన్ ఒంటరిగానే తన రాజకీయం తాను అన్నట్లుగా ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులే వస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు. ఇపుడు ఎంతటి పెద్ద పార్టీ అయినా సంకీర్ణ యుగంలో పొత్తులతో ముందుకు సాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు అదే చేస్తున్నాయి.

ఏపీ వరకూ చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ వరకూ పాతుకుపోయినా టీడీపీ జనసేన బీజేపీలను తన వెంట తీసుకు పొత్తులు కలుపుకుంటోంది. మరి రాజకీయాల్లో వస్తున్న మార్పులు చేర్పులు అన్నీ జగన్ కి అర్ధం అవుతున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ ఈ విషయంలో తీరుని మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు. లేకపోతే రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో గతంలో జరిగినదే రిపీట్ అవుతుందని ఆశపడితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News