జగన్‌ ప్రభుత్వంపై జేడీ ప్రశంసలు వ్యూహాత్మకమేనా?

జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ఇటీవల వరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రై వేటీకరణ కాకుండా పోరాటం జరిపారు

Update: 2023-10-27 11:11 GMT

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల ముందు స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. 2,88,874 ఓట్లు సాధించారు. మొత్తం ఆయనకు 23 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలయ్యాక పవన్‌ కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడాన్ని అంగీకరించలేక జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.

జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ఇటీవల వరకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రై వేటీకరణ కాకుండా పోరాటం జరిపారు. నిత్యం సోషల్‌ మీడియాలో ఈ అంశంపై ట్వీట్లు చేశారు.

జనసేన నుంచి బయటకొచ్చాక లక్ష్మీనారాయణకు టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీ ఇలా పలు పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయని.. ఆ పార్టీల్లో చేరనున్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు.

ప్రస్తుతం లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో కొంత భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి సాగు చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల ఆహ్వానం మేరకు వాటిని సందర్శిస్తున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ ఇటీవల తేల్చిచెప్పారు. విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రై వేటీకరణ రద్దు, రాష్ట్ర విభజన అంశాల అమలు వంటి వాటిని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన పార్టీలో చేరతానన్నారు. లేదంటే ఇండిపెండెంట్‌ గా అయినా విశాఖ నుంచి పోటీ చేస్తానని తెలిపారు,

కాగా ఇటీవల కాలంలో జేడీ లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివిధ అంశాలపై జగన్‌ ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. తాజాగానూ ఆయన వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష, నాడు–నేడు పథకాలు ఎంతో బాగున్నాయని కొనియాడారు. నాడు–నేడు పథకంతో తాను చదువుకున్న పాఠశాల రూపురేఖలు కూడా మారాయన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని మెచ్చుకున్నారు.

విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన ప్రభుత్వానికి సానుకూల ఫలితాలు ఉంటాయని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హాట్‌ కామెంట్స్‌ చే శారు. జగన్‌ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు.

కాగా జగన్‌ పై అవినీతి, అక్రమాస్తుల కేసులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణను జగన్‌ ను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. అప్పట్లో నిత్యం మీడియాలో జేడీ లక్ష్మీనారాయణ పేరు మారుమోగిపోయేది.

వైసీపీ ప్రభుత్వంపై తాజా ప్రశంసల నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ జేడీ తమ పార్టీలో చేరతామంటే తమకెలాంటి అభ్యంతరం లేదని వైసీపీ ముఖ్య నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News