ఎన్నికల నోటిఫికేషన్ పై జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ "సిద్ధం" అంటూ వైసీపీ కీలక సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో "సిద్ధం" సభలు జరగగా... తాజాగా అద్ధంకి నియోజకవర్గంలో ఆఖరి "సిద్ధం" సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మరో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అవును... తాజాగా అద్ధంకి నియోజకవర్గంలో జరిగిన "సిద్ధం" సభకు దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి సుమారు 15 లక్షల మంది కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు హాజరైనట్లు చెబుతున్నారు. ఈ సభకు హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన జగన్... మరో నాలుగు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని తెలిపారు. ఈ క్రమంలో కార్యకర్తలంతా "సిద్ధం"గా ఉండాలని తెలిపారు.
ఈ సభలో మైకందుకున్న జగన్... బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అన్నట్లుగా ఇక్కడికి జనం తరలివచ్చారని మొదలుపెట్టి... కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయని.. వీరంతా కలిసి మన భవిష్యత్తుపై దాడిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇదే సమయంలో చంద్రబాబుతో కూటమిగా ఏర్పడినవారంతా జగన్ ని ఓడించడానికి చూస్తుంటే... జగన్ మాత్రం పేదలను గెలిపించడానికి చూస్తున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా తనకు అండగా ఉండేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సైనికులు లేని సైన్యాధికారులు మాత్రమే ఉన్న పార్టీలు చంద్రబాబు బలమైతే... ప్రజలే బలంగా మనం ఉన్నామని నొక్కి చెప్పారు.
ఇక తనకు పదిమంది స్టార్లు లేరని.. స్టార్ క్యాంపెనియర్లు లేరని.. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదని.. రకరకాల పార్టీలతో పొత్తులు కూడా లేవని.. ఈ సమయంలో ఒంటరిగానే ఎన్నికలు వెళ్తున్నామని.. తనకు ఉన్నదళ్లా ప్రజల బలమే అని జగన్ స్పష్టం చేశారు. పేద ప్రజలు పేదరిక సంకెళ్లు తెంచుకుని బయటపడాలన్నదే తన లక్ష్యమని జగన్ స్పష్టం చేశారు.