నా దగ్గర డబ్బు లేదు.. బాబు ఇస్తారు.. ఓటు నాకే వేయండి: జగన్
తాజాగా విజయనగరం జిల్లా ఎస్టీ నియోజకవర్గం సాలూరు సహా పలు నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్.. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని.. అప్పుల్లో ఉన్నాన ని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని చెప్పారు. అయితే.. ఆయన దగ్గర డబ్బులు మూలుగుతున్నాయి కాబట్టి.. వాటిని తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ, ఓటు మాత్రం వైసీపీకే వేయాలని చెప్పారు. తాజాగా విజయనగరం జిల్లా ఎస్టీ నియోజకవర్గం సాలూరు సహా పలు నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్.. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు.
తను ప్రస్తుతం అప్పుల్లో ఉన్నట్టు చెప్పారు. డబ్బులు ఇచ్చేందుకు తన దగ్గర ఏమీ లేవన్నారు. అయినా ప్రజలు తనను బిడ్డగా చూస్తున్నారని.. చెప్పారు. ఇక, తాను మాట తప్పేది లేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జిల్లాల విభజనలో అనేక సమస్యలు వచ్చినా.. ప్రజల ఆకాంక్షలకే మొగ్గు చూపినట్టు చెప్పారు. విజయనగరం జిల్లాను మూడు జిల్లాలుగా మార్చి.. ఇక్క డి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకువచ్చానన్నారు. అదేవిధంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసే విషయంలో మాట తప్పేది లేదన్నారు. ఎంత మంది అడ్డుపడ్డా.. విశాఖను రాజధానిని చేసి తీరుతానని చెప్పారు.
''జూన్ 4న ఫలితాలు వస్తున్నాయి. తర్వాత.. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది ఎక్కడో తెలుసా? విశాఖలో. ఇక్కడే ఉంటా. ఇక్కడి ప్రాంతాలను అబివృద్ధి చేస్తా. ఎందరు అడ్డుపడినా విశాఖను రాజధాని ప్రాంతం చేస్తా'' అని జగన్ వ్యాఖ్యానించారు.
జగన్ నోట అభివృద్ధి మాట
సీఎం జగన్ తాజాగా ఉత్తరాంధ్రకు ఏం చేశారో వివరించారు. నిజానికి ఆయన కొన్నాళ్లుగా సంక్షేమ పథకాలను మాత్రమే వివరిస్తున్నారు. తాజాగా మాత్రం అభివృద్ధిపై మాట్లాడారు. జగన్ చెప్పిన ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇదీ..
+ సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
+ భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరణ
+ ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు
+ గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్ కనెక్టవిటీ
+ ఉద్దాన సమస్యను పరిష్కరించాం
+ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం